ఫైర్ బ్రాండ్ వీర శివారెడ్డి దారెటు…

kadapa fire brand veera shivareddy political journey, ఫైర్ బ్రాండ్ వీర శివారెడ్డి దారెటు…

కడప రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేత వీర శివారెడ్డి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించిన వీరశివారెడ్డికి పార్టీ అధిష్టానం మొండి చేయి చూపించింది. ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చినా సరిపెట్టుకుంటానని ప్రాధేయపడినా లాభం లేకపోయింది. దీంతో విసిగిపోయిన వీరశివుడు సరిగ్గా పోలింగ్ రోజు ప్లేట్ ఫిరాయించి వైసీపీకి జై కొట్టారు. ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి రావడంతో తన మెడలో వీరతాడు వేస్తారని భావించారట.

కమలాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి, ఎంపీగా గెలిచిన జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి, ఫలితాలు వెలువడ్డాక తన ఇంటికి వచ్చి ధన్యవాదాలు తెలపడంతో వీరశివారెడ్డి చాలా సంబరపడిపోయారట. తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉన్నా తన కుమారుడి ఫ్యూచర్ బావుంటుందని భావించారట. దీంతో టీడీపీకి తాను గుడ్ బై చెప్తున్నానని, వై ఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకుంటానని ప్రకటించారట. అయితే రోజులు గడుస్తున్నా వైపీసీనుంచి పాజిటివ్ సిగ్నల్స్ రాకపోవడంతో వీర శివారెడ్డికి ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొందట.

తనయుడి రాజకీయ భవిష్యత్ కోసం ఒక మెట్టు కిందకు దిగి వైసీపీలో చేరాలనుకుంటే అటువైపునుంచి సానుకూల సంకేతాలు రాకపోగా.. ఎన్నికలకు ముందు తన వద్దకు వచ్చి తన మద్దతు కోరిన నేతలు కూడా మొహం చాటేసారట. స్వయంగా జగన్ అపాయింట్ మెంట్ కోసం చేసిన యత్నాలు కూడా ఫలించకపోవడంతో వీరశివుడు డైలమాలో పడ్డారట.

అంతేకాకుండా డీసీసీబీ చైర్మన్ గా కాలపరిమితి ముగిసిన తన కుమారుడు అనిల్ కుమార్ రెడ్డికి సొసైటీ ఎన్నికలు జరిగే వరకూ కొనసాగింపు ఇస్తారని ఆశించారట. అయితే జగన్ ఈ విషయంలో కూడా వీర శివుడికి ఝలక్ ఇచ్చారట. దీంతో రాజకీయంగా ఎదగాలంటే ఏదో ఒక పార్టీ అండ ఉండాలని భావించి, కమలం గూటికి వెళ్లాలని భావిస్తున్నారట వీరశివారెడ్డి.

జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా వీరశివుడు సీఎం రమేశ్ ను కలిశారట. ఈ సంర్భంగా పార్టీలోకి వస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సీఎం రమేశ్ చెప్పారట. వీర శివుడు ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించారట. త్వరలో కమలం కండువా కప్పుకుంటానని వీర శివుడు తన అనుచరులతో చెప్పారట. ఏదేమైనా వీరశివారెడ్డి బీజేపీలో చేరడం ఖాయమన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *