Breaking News
  • సికింద్రాబాద్‌-మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు. డిసెంబర్‌ 1,8,15,22,29 తేదీల్లో నడవనున్న ప్రత్యేక రైళ్లు. మచిలీపట్నంలో మధ్యాహ్నం 2:25కి బయల్దేరి.. రాత్రి 10:10కి సికింద్రాబాద్‌కు చేరుకోనున్న ప్రత్యేక రైలు. అదేరోజు సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11:55కి బయల్దేరి.. మరుసటి రోజు ఉ.8:55కి మచిలీపట్నం చేరుకోనున్న ప్రత్యేక రైలు.
  • ఏపీకి నెంబర్లు కేటాయించిన కేంద్రం. అక్రమ మైనింగ్‌, అనధికార మద్యం అమ్మకాలపై.. ఫిర్యాదులకు నెంబర్లు కేటాయించిన కేంద్ర సర్కార్‌. అక్రమ మైనింగ్‌పై ఫిర్యాదు కోసం 14400 నెంబర్‌.. అనధికార మద్యంపై ఫిర్యాదుకు 14500 నెంబర్‌ కేటాయింపు.
  • మళ్లీ పెరిగిన బంగారం ధరలు. పెళ్లిళ్ల సీజన్‌ కొనుగోళ్లతో పెరిగిన పసిడి ధరలు. 10గ్రాముల 24క్యారెట్ల బంగారంపై రూ.225 పెంపు. రూ.38,715 పలుకుతున్న 10గ్రాముల బంగారం. రూ.440 పెరిగి రూ.45,480కి చేరిన కిలో వెండి ధర.
  • ఛండీగడ్‌: 2019 ప్రపంచ కబడ్డీ కప్‌కు పంజాబ్ ఆతిథ్యం. డిసెంబర్‌ 1 నుంచి 9 వరకు మ్యాచ్‌ల నిర్వహణ. సుల్తాన్‌పూర్‌ లోధిలోని గురునానక్‌ స్టేడియంలో ప్రారంభ వేడుక. ప్రపంచ కబడ్డీ టోర్నీలో పాల్గొననున్న భారత్, అమెరికా, శ్రీలంక.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెన్యా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, కెనడా జట్లు.
  • ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ విడుదల. జనవరి 1, 2020 అర్హత తేదీతో ఓటర్ల జాబితా సవరణ. ఓటర్ల వివరాల పరిశీలనకు ఈనెల 30 తుది గడువు. డిసెంబర్‌ 16న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ. 2020, జనవరి 15న అభ్యంతరాలు, వినతుల స్వీకరణ.
  • టిక్‌టాక్‌కు పోటీగా త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌. రీల్స్‌ పేరిట ఓ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఎక్స్‌ప్లోర్‌ సెక్షన్‌లో కొత్త ఫీచర్. కొత్త ఫీచర్‌లో టిక్‌టాక్ మాదిరిగా వీడియోలు క్రియేట్‌ చేసే సౌకర్యం.

‘హుజూర్’..! కేసీఆర్ వ్యూహంలో కేకే..! ‘కమలానికి’ నో వే..!

టీఆర్ఎస్‌లోని సీనియర్ నేతల్లో కె.కేశవరావు(కేకే)ఒకరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ వస్తోన్న కేకే.. పార్టీ జనరల్ సెక్రటరీగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు పార్టీలో కేసీఆర్ తరువాత వినిపించే పెద్ద నేతల లిస్ట్‌లో కేకే పేరు కచ్చితంగా ఉంటుంది. ఇక ఇంతవరకు కేసీఆర్ చెబితే తప్ప.. ఏ విషయాన్ని కేకే మీడియా ముందుకు వచ్చి చెప్పిన సందర్భాలు లేవు. అలాంటి ఉన్నట్లుండి ఆయన ఇటీవల యాక్టివ్ అయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో.. ప్రభుత్వానికి, ఆర్టీసీ కార్మికులకు తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం మినహా కార్మికులు లేవనెత్తిన డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని కేకే కోరారు. ఇందుకు ఆర్టీసీ జేఏసీ కూడా సానుకూలంగా స్పందించింది. కేకే ఆహ్వానిస్తే చర్చలకు వెళ్తామని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. దీంతో సమస్య పరిష్కారం అవుతుందని చాలామంది భావించారు. కానీ ఆ మరుసటి రోజే ఆయన యూటర్న్ తీసుకున్నారు. చర్చలు చేపట్టడానికి తాను ఎవరిని అంటూ కేకే షాక్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చర్చలకు దిగుతానని.. కానీ తనకు ఆయన అపాయింట్‌మెంట్ ఇంకా దొరకలేదని కేకే చెప్పుకొచ్చారు. దీంతో కేకే వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యమేంటన్నది ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

కాగా కేకే రాజ్యసభ సభ్యత్వం మరో నాలుగు నెలల్లో ముగియనుంది. ఈ క్రమంలో కేకే వయసును దృష్టిలో పెట్టుకున్న కేసీఆర్.. తన పార్టీ తరఫున ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపేందుకు సుముఖంగా లేరన్న టాక్ వినిపించింది. మరోవైపు నలుగురు టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులతో సహా పార్టీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేకే.. టీఆర్ఎస్‌ను వీడుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన త్వరలోనే కాషాయ కండువాను కప్పుకోనున్నట్లు కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ ఈ పుకార్లను ఆయన ఖండించారు. టీఆర్ఎస్‌ను వీడే ప్రసక్తే లేదని.. బీజేపీ సిద్ధాంతాలు తన రక్తంలో లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గురువారం హుజూర్‌‌నగర్‌లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన కేసీఆర్.. తన వెంట కేకేను కూడా తీసుకెళ్తున్నారు. దీంతో ఆయనను వదులుకునేందుకు కేసీఆర్ కూడా సుముఖంగా లేరని అర్థమవుతోంది. మరి ఇప్పుడైనా కేకే పార్టీ మార్పు వార్తలకు చెక్ పడుతుందేమో చూడాలి.