కర్ణాటకలో అప్పుడే ముసలం.. షాకిచ్చిన జేడీ-ఎస్

కర్నాటకలో కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. లోక్ సభ ఎన్నికల్లో కూటమి ఓటమిని నిరసిస్తూ.. జేడీ-ఎస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎ.హెచ్. విశ్వనాథ్ రాజీనామా చేశారు. ఆయనతో బాటు ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. దీంతో స్వామి సర్కార్ ట్రబుల్స్ దిశగా సాగడం మొదలైంది. ఏడాదిగా అధికారంలో కొనసాగుతున్న కుమారస్వామి ప్రభుత్వాన్ని ‘ గండాల ‘ నుంచి గట్టెక్కించేందుకు పాలక కూటమి ఓ వైపు మంత్రివర్గ విస్తరణ, లేదా పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెడుతుండగా ఈ తాజా పరిణామాలు ఒకదానివెంట ఒకటి చోటు చేసుకున్నాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తానని విశ్వనాథ్ పేర్కొన్నారు. పైగా కీలక అంశాలపై సొంత పార్టీవారే తనను పక్కన బెట్టడంపట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్-జేడీ-ఎస్ పార్టీల మధ్య సరైన సమన్వయాన్ని కూర్చడంలో కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సిధ్దరామయ్య విఫలం చెందారని ఆయన ఆరోపిస్తున్నారు. అటు-కాంగ్రెస్ పార్టీ కూడా కుమారస్వామి ప్రభుత్వ తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆయన జేడీ-ఎస్ కి ఇస్తున్న ప్రాధాన్యం తమ పార్టీకి ఇవ్వడం లేదని రాష్ట్ర పార్టీ నేతలు అసంతృప్తి ప్రకటిస్తున్నారు. ఒక దశలో సిద్దరామయ్య సైతం.. కుమారస్వామి సర్కార్ తీరును ఆక్షేపించిన సంగతి తెలిసిందే. ఇటీవలి ఎన్నికల్లో కూటమి వైఫల్యానికి కుమారస్వామి కారణమని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు తెలిసింది. మరోవైపు మాజీ సీఎం, బీజేపీ నేత యడ్యూరప్పసమయంకోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆట్టే కాలం లేదని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆయన.. సీఎం కుర్చీ మళ్ళీ తననే వరించవచ్చునన్న కొండంత ఆశతో ఉన్నారు. జేడీ-ఎస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడల ఓటమి తదితరాలు కర్ణాటకలో
బీజేపీ ఆశలను చిగురింపజేస్తున్నాయి. సంకీర్ణ కూటమి తనకు తానే కూలిపోవచ్ఛునని కమలనాథులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *