Jangaon Tension : టెన్షన్.. టెన్షన్.. జనగామకు బండి సంజయ్.. భారీగా పోలీసుల మోహరింపు

బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌కు నిరసనగా చలో జనగామ చేపట్టారు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌. సీఐ మల్లేష్‌పై 24 గంటల్లో చర్యలు..

  • Sanjay Kasula
  • Publish Date - 12:17 pm, Wed, 13 January 21

Jangaon Tension : బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌కు నిరసనగా చలో జనగామ చేపట్టారు ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌. సీఐ మల్లేష్‌పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని నిన్న డెడ్‌లైన్ పెట్టారాయన. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని సైతం ముట్టడిస్తామని హెచ్చరించారు. దీంతో.. జనగామలో పోలీసులు అలర్టయ్యారు. ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు జనగామ జిల్లాలో వివాదాస్పదమైంది. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా తాము ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారో మున్సిపల్‌ కమిషనర్‌ జవాబు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. మునిసిపల్‌ కమిషనర్‌ చాంబర్‌ ముందు కాషాయ కార్యకర్తలు ధర్నాకు దిగడం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో లాఠీచార్జ్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.

వివేకానందుని జన్మదినం సందర్భంగా మంగళవారం జనగామ చౌరస్తా నుంచి నెహ్రూ పార్కు వరకు బీజేపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశాలతో సిబ్బంది వాటిని తొలగించారు. దీంతో ఆగ్రహించిన బీజేపీ నాయకులు కమిషనర్‌ కార్యాలయం ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు మున్సిపల్‌ ఆఫీస్‌కు వచ్చారు. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కార్యకర్తలను కోరారు. బీజేపీ కార్యర్తలపై లాఠీఛార్జ్‌ చేశారు. ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు. విచక్షణారహితంగా కొట్టిన సీఐ మల్లేష్‌ పై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.

దీంతో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు ఠాణాకు చేరుకుని ధర్నా చేశారు. కమిషనర్‌ క్షమాపణలు చెప్పడం, బీజేపీ నేతలపై ఫిర్యాదును ఉపసంహరించుకోవడంతో గొడవ సద్దుమణిగింది.  బీజేపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్‌కు నిరసనగా రేపు చలో జనగామకు పిలుపునిచ్చారు ఆపార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌. సీఐ మల్లేష్‌పై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. లేదంటే డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. స్వామి వివేకానంద ఉత్సవాలు జరపడం దేశద్రోహమా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి :

ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌‌కు అడుగు దూరంలో అంకిత రైనా.. ఇది గెలిస్తే సరికొత్త రికార్డు

కోడి పందేలకు సై అంటున్న ఉభయగోదావరి జిల్లాలు.. బరులు సిద్ధం చేస్తున్న పందెంరాయుళ్లు