మరో కుట్రకు ప్లాన్ చేశారా? ఐబీ హెచ్చరికలు

Jaish e Muhammad troops entered in Kashmir

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయా? అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భారీ దాడులు జరిపే అవకాశాలున్నట్టుగా బలమైన సమాచారం ఉంది. దీంతో ఎక్కడిక్కడకే భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఇప్పటికే జైషే మహ్మద్ సంస్ధకు ఏడుగురు సభ్యుల ఉగ్రవాదుల బృందం భారత్‌లో ప్రవేశించి భారీగా ప్రాణం, ఆస్తి నష్టం కలిగించేలా ప్లాన్ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో పాక్ రకరకాలుగా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం పాక్‌ను ఒంటరిని చేయడంతో ఏం చేయాలో అర్ధం కాక ఇలాంటి విద్వేష పూరిత దాడులకు పాల్పడాలని కుట్రపన్నినట్టుగా నిఘావర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు బినిహల్, పిర్ పంజాల్ పర్వాతాల దక్షిణ భాగం నుంచి దేశంలోకి ఏడుగురు ఉగ్రవాదులు ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు.

మరోవైపు ఆదివారం పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ట్వీట్‌ చేస్తూ, కశ్మీర్‌లో కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందనీ, సైనిక బలగంతో స్వాతంత్య్ర పోరాటాన్ని అణచివేయలేరని పేర్కొన్నారు. ఇటీవల కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు ఇమ్రాన్. కశ్మీర్‌లో పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశాలున్నాయని, ఇరు దేశాల మధ్య యుద్ధం కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కశ్మీర్ ప్రాంతంలో మరో ఘాతుకానికి తెగబడేందుకు పాక్ ప్రణాళిక రచిస్తున్నట్టుగా భారత్ ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు జమ్ము కశ్మీర్ సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైనికులు మోహరించారు. ప్రజలెవ్వరూ వీధుల్లోకి రావొద్దని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఆదివారం వీధుల్లోకి జనం రాకపోవడంతో భారీగా నష్టపోయినట్టు వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *