జగన్ టీమ్‌లోకి మళ్ళీ ప్రశాంత్ కిశోర్.. ఈసారి టాస్క్ ఏంటంటే ?

ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వ్యక్తిని అడిగినా ప్రశాంత్ కిశోర్ ఎవరో చెప్పేస్తారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా.. రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ దేశ ప్రజలకు సుపరిచితులయ్యారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీని సమాయత్తం చేయడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా కీలకమైనదనే చెప్పాలి. పాదయాత్ర నుంచి మేనిఫెస్టో రూపకల్పన దాకా వైసీపీ విజయ ప్రస్థానంలో […]

జగన్ టీమ్‌లోకి మళ్ళీ ప్రశాంత్ కిశోర్.. ఈసారి టాస్క్ ఏంటంటే ?
Follow us

|

Updated on: Nov 19, 2019 | 4:19 PM

ప్రశాంత్ కిశోర్.. ఏ మాత్రం రాజకీయ పరిఙ్ఞానం వున్న వ్యక్తిని అడిగినా ప్రశాంత్ కిశోర్ ఎవరో చెప్పేస్తారు. 2014లో ప్రధాని నరేంద్ర మోదీకి, ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా.. రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్ దేశ ప్రజలకు సుపరిచితులయ్యారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వైసీపీని సమాయత్తం చేయడంలో ప్రశాంత్ కిశోర్ పాత్ర చాలా కీలకమైనదనే చెప్పాలి. పాదయాత్ర నుంచి మేనిఫెస్టో రూపకల్పన దాకా వైసీపీ విజయ ప్రస్థానంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. అందువల్లే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి.. ప్రశాంత్ కిశోర్ అభినందన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు కొంత మంది పార్టీ సీనియర్ల సమక్షంలో.

ఆ తర్వాత ప్రశాంత్ కిశోర్ తెలుగు పాలిటిక్స్‌లో పెద్దగా కనిపించలేదు. కానీ తాజాగా ఆయనను మరోసారి జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజానికి ప్రశాంత్ కిశోర్ టీమ్‌లోని కొందరు ఆల్‌రెడీ జగన్ ప్రభుత్వంలోను, వైసీపీలోను వ్యూహకర్తలుగా పనిచేస్తూనే వున్నారు. ఒక్క ప్రశాంత్ కిశోర్ మాత్రం నేరుగా ఏపీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఆరు నెలల తర్వాత మరోసారి ప్రశాంత్ కిశోర్ అవసరం కనిపించడంతో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను పిలిపించినట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూకుడు పెంచింది. పలు పథకాల కింద లబ్ధిదారులకు పెద్ద ఎత్తున ఆర్థిక సాయం అందిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే.. విభజన సమస్యల నుంచి ఇంకా బయట పడని ఏపీలో నిధుల కొరత తీవ్రంగా వుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఒక వైపు సంక్షేమ పథకాల వల్ల పడిన అదనపు భారం, మరోవైపు ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఏపీ ఆర్థిక పరిస్థితి కునారిల్లి పోతోందన్న కథనాలున్నాయి. ఈ అంశాలను సమీక్షించిన జాతీయ మీడియా ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి వెనుకంజలో వుందంటూ కథనాలు రాశాయి.

ఇది జాతీయ స్థాయిలో జగన్‌పై అసమర్థ పాలకుడనే ముద్రను తెచ్చిపెడుతోంది. ఈ పరిస్థితి జాతీయ స్థాయిలో తన ఇమేజీకి ఇబ్బందికరంగా వుంటుందన్న భావనతో జాతీయ మీడియా బాధ్యతలను సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, అరవింద్ యాదవ్‌లకు జగన్ అప్పగించారు. అయినా జాతీయ మీడియాలో విశ్లేషణలు నెగెటివ్‌గా వస్తూనే వుండడంతో పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రశాంత్ కిశోర్ సలహాలను, సూచనలను జగన్ అడిగినట్లు తెలుస్తోంది.

దాంతో ఇదివరకే అమరావతిలో కొనసాగుతున్నతన టీమ్ సభ్యులతో కలిసి ప్రశాంత్ కిశోర్ జగన్‌తో భేటీ అయ్యారని తెలుస్తోంది. జాతీయ మీడియాకు తమ సంక్షేమ పథకాల విలువను తెలియజేయడంతోపాటు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరాలందించే అంశంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ప్రశాంత్ కిశోర్ సలహాలతోపాటు తనకు ఆల్‌రెడీ సలహాదారులుగా వున్న అమర్ లాంటి వారి డైరెక్షన్‌లో జాతీయ స్థాయిలో ఇమేజీ పెంచుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. సో.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు ప్రశాంత్ కిశోర్ మరోసారి అడ్వైజర్‌గా మారారన్నమాట.