ఎందరికో ఆదర్శం.. ఈ ఎనభై మూడేళ్ల వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Its never too late for learning :This Punjab man gets masters degree at 83, ఎందరికో ఆదర్శం.. ఈ ఎనభై మూడేళ్ల వ్యక్తి.. ఎందుకో తెలుసా?

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అనే మాట మనం ఇప్పటికీ ఎన్నోసార్లు వింటూనే ఉన్నాం. పట్టుదల ఉంటే కానిది లేదని దాన్ని నిరూపించిన ఎంతోమంది కృషీవలురు అక్కడక్కడా తారసపడతారు. ఆ కోవకు చెందిన ఓ పెద్దాయన ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆయన సాధించింది ఏమిటో తెలుసా? ఎనభై మూడేళ్ల వయసులో ఇంగ్లీష్ లిటరేచర్‌లో మాస్టర్స్ డిగ్రీని సొంతం చేసుకున్నారు.

సోహమ్‌సింగ్ గిల్ (83) అనే వయోధికుడు పుట్టింది హోషిపూర్ సమీపంలోని దాటా అనే చిన్న గ్రామం. ఆయన 1937 ఆగస్టు 15 న జన్మించారు. గ్రామీణ పాఠశాలలో ప్రాథమిక విద్యను అభ్యసించి.. మహిల్‌పూర్‌లోని ఖల్సా హైస్కూల్ నుంచి మెట్రిక్యూలేషన్ చదివి 1957లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత టీచింగ్ కోర్సులో చేరడంతో అక్కడితో ఆయనకు ఉన్నత చదువులు చదడానికి కుదరలేదు. ఆ తర్వాత సోహమ్‌సింగ్ కెన్యాలో ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు. ఆ విధంగా 1991 వరకు ఆయన అక్కడే ఉండి తర్వాత భారత్‌కు తిరిగి వచ్చారు. 2017 వరకు ఆయన పలు పాఠశాలల్లో టీచర్‌గా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా ఎంతోమందికి విద్యను బోధిస్తున్నప్పటికీ ఆయనలో మాత్రం మాస్టర్స్ డిగ్రీ చేయాలనే కోరిక మాత్రం సన్నగిల్లలేదు. అదే ఆయనను పూర్తి చేయించింది. ఆయన కాలేజీలో చదువుతున్న రోజుల్లో పర్యామ్ సింగ్ అనే వైస్ ప్రిన్సిపల్ .. మాస్టర్స్ డిగ్రీ చదివి లెక్చరర్ కావాలని తనకు ఎన్నోసార్లు చెప్పారని ఆ మాటలే తనకు ప్రేరణగా నిలిచాయని సోహమ్‌సింగ్ చెబుతున్నారు. ఆ కల ఇంతకాలానికి నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

తాను మాస్టర్స్ డిగ్రీని చదివేందుకు ఓ దూరవిద్యాకేంద్రంలో చేరానని, రెండేళ్లపాటు దానిలో విద్యానభ్యసించి విజయం సాధించానంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎనభై మూడేళ్ల సోహమ్‌సింగ్. ఐఈఎల్ఈటీ స్టూడెంట్స్‌తో పాటు తాను శిక్షణ తీసుకోవడం వల్ల మంచి మార్కులు సంపాదించినట్టు ఆయన చెప్పారు. విద్యాదాహానికి వయసుతో సంబంధం లేదంటున్నారీయన.

తన వయసు ఎనభై మూడేళ్లయినా ఆరోగ్యవంతమైన జీవనశైలి, పాజిటివ్ థింకింగ్ తనను విజేతగా నిలిపాయని ఆయన పేర్కొన్నారు. ఇకపై తాను చిన్నారుల కోసం పుస్తకాలు రాస్తానని సోహమ్‌సింగ్ గిల్ చెప్పారు. పట్టుదల ఉంటే కానిది లేదని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పిన సోహమ్‌సింగ్ గిల్.. తన ఎనిమిది పదుల వయసులో మాస్టర్స్ డిగ్రీ సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సాధించిన విజయం ఎందరికో మార్గాన్ని చూపుతుందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *