ఉపాధి అవకాశాలు మనకే ఎక్కువ : మంత్రి కేటీఆర్

IT growth is 17 percent in Hyderabad says Minister Ktr in assembly, ఉపాధి అవకాశాలు మనకే ఎక్కువ : మంత్రి కేటీఆర్

బెంగళూరు కంటే ఎక్కువ ఉపాధి అవకాశాలు తెలంగాణలోనే సృష్టించబోతున్నామన్నారు ఐటీ శాఖా మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం పరిశ్రమల పద్దుపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అంతర్జాతీయ సంస్ధలు హైదరాబాద్‌కు తరలివస్తున్నాయని.. ఈ విషయంలో బెంగళూరు కంటే మనమే ముందున్నామన్నారు. బెంగళూరులో ఐటీ అభివృద్ధి 7- 9 శాతం ఉండగా హైదరాబాద్‌లో 17శాతం ఉందని తెలిపారు. ఈ ఏడాదిలో హైదరాబాద్‌నుంచి రూ.లక్ష కోట్ల ఐటీ ఎగుమతులు జరిగినట్టు కేటీఆర్ వివరించారు.

గడచిన ఐదేళ్లలో రాష్ట్రంలో 59 ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేశామని, అపాచీ, రాఫెల్ కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టాయని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటికే బోయింగ్ సంస్ధ తన ఉత్పత్తి ప్రారంభించిందని, సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో అతిపెద్ద స్టెంట్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశామన్నారు కేటీఆర్. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మన హైదరాబాద్ నగరాన్ని తక్కువ చేసి చూపొద్దని, త్వరలోనే ఖమ్మం, కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్న ఐటీ హబ్‌లు కూడా ప్రారంభం కానున్నాయని మంత్రి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *