విజయవంతంగా చంద్రయాన్-2 కక్ష్య కుదింపు!

ISRO Performs Fourth Lunar-Bound Orbit Maneuver For Chandrayaan-2, విజయవంతంగా చంద్రయాన్-2 కక్ష్య కుదింపు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 వ్యోమనౌక జాబిలివైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. శుక్రవారం సాయంత్రం 06.18 గంటలకు నాలుగోసారి కక్ష్య కుదింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్లు ఇస్రో వెల్లడించింది. 1155 సెకన్లపాటు ప్రొపల్షన్ సిస్టమ్‌ను మండించి 124కి.మీ.x 164 కి.మీ. కక్ష్యలోకి చంద్రయాన్-2ను విజయవంతంగా చేర్చినట్లు పేర్కొంది. తదుపరి కక్ష్య కుదింపు ప్రక్రియను సెప్టెంబర్ 1న సాయంత్రం 6-7 గంటల మధ్య చేపట్టనున్నట్లు తెలిపింది. ఈ నెల 20న చంద్రయాన్-2 వ్యోమనౌక విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఆదివారం చివరి కక్ష్య కుదింపు ప్రక్రియను చేపట్టనున్నారు. సెప్టెంబర్ 2న ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడిపోయి 100 కి.మీ.x 30 కి.మీ. కక్ష్యలోకి చేరుతుందని ఇస్రో తెలిపింది. అనంతరం సెప్టెంబర్ 7న ల్యాండర్ విక్రమ్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంపై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపించడానికి అత్యంత క్లిష్టమైన ప్రక్రియను చేపట్టాల్సి ఉందని వివరించింది. బెంగళూరు సమీపంలోని బైలలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ యాంటెన్నాల సాయంతో ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లోని మిషన్ ఆపరేషన్ కాంప్లెక్స్ నుంచి వ్యోమనౌక గమనాన్ని శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *