పేషంట్ల డేటా డాక్టర్ల చేతిలో..అంతా సీక్రెట్ !

Medical data, పేషంట్ల డేటా డాక్టర్ల చేతిలో..అంతా సీక్రెట్ !

ప్రాక్టో యాప్.. ఈ యాప్ ని ఉపయోగించి ఒక రోగికి, డాక్టర్ కు మధ్య జరిగే సంభాషణను రికార్డు చేయవచ్చునట. ఈ సంభాషణ తాలూకు రికార్డింగ్ ఈ సంస్థ నిర్వహించే సర్వర్లలో సేవ్ అయిఉంటుందని  తెలుస్తోంది. అంటే..ముఖ్యంగా రోగులు డాక్టర్లకు చెప్పే సమాచారమంతా వీటిలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట ! కానీ ఇది సర్వర్లలో ‘ దాగి ‘ ఉంటుందన్న విషయం తమకు తెలియదని డాక్టర్లు చెబుతున్నారు. ప్రాక్టో  సంస్థకు, తమకు మధ్య ఓ బిల్లింగ్ విషయంలో కొంత వివాదం రేగిందని, దీంతో ఈ సంస్థ ప్రతినిధులు తమ క్లినిక్ కి వచ్చి.. తమ కాల్స్ కు సంబంధించిన రికార్డింగుల డ్యాష్ బోర్డును చూపారని బెంగుళూరులోని ఓ కాస్మెటిక్ సర్జన్ తెలిపారు.అది చూసి తాను షాక్ తిన్నానని ఆయన పేర్కొన్నాడు. డాక్టర్లతో వివాదాల పరిష్కారానికి తమ కంపెనీ ఈ రికార్దింగులనుసులభంగా యాక్సెస్ చేయగలుగుతుందని ఆ ప్రతినిధులు చెప్పినట్టు ఆయన వెల్లడించారు. అంటే.. యూజర్ల మెడికల్ డేటా ను ఈ సంస్థ రహస్యంగా ట్రాక్ చేస్తోందన్న మాట..పైగా ఈ యాప్ వంటివి.. ప్రతి రోగికి సంబంధించిన డాక్టర్ల అపాయింట్ మెంట్ ఫీజులపై కూడా ‘ నిఘా ‘ పెడతాయని తెలుస్తోంది. రోగికి, డాక్టర్ కు మధ్య వారధిలా ఉండాల్సిన ఇవి..’ సీక్రెట్ ఏజంట్ల ‘ లా పని చేస్తున్నాయని కొందరు వైద్యులే అభిప్రాయ పడ్డారు.ప్రపంచ వ్యాప్తంగా రోగుల మెడికల్ రికార్డులకు భద్రత అంటూ లేదు. ఎవరైనా వీటిని రకరకాల యాప్ ల ద్వారా సేకరించవచ్చు. పేషంట్లనో, డాక్టర్లనో బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా వీటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

మందుల డెలివరీకి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్ల విషయంలో రోగుల డేటా ను ప్రాక్టో వినియోగించుకుంటూ వాట్సాప్ సందేశాలను తమవారికి సర్క్యులేట్ చేయడమే గాక.. డాక్టర్ల రికార్డులను దుర్వినియోగం చేస్తున్నట్టు వెల్లడైంది. విజయ కుమార్ అనే వ్యక్తి తన బ్లాగ్ పోస్ట్ లో.. ఈ కంపెనీ డ్యాష్ బోర్డును చూపి..వాటిలోని మెసేజ్ లను కూడా స్పష్టంగా చూపడం విశేషం. అయితే తాము ఇలాంటి అనుచిత చర్యలకు పాల్పడడంలేదని ప్రాక్టో ఖండిస్తోంది. ప్రైవేటు మెడికల్ డేటాను భద్రపరచడానికి ఉద్దేశించిన చట్టాలు ఇండియాలో లేవు. అందువల్లే ప్రాక్టో వంటి సంస్థలు దర్జాగా రోగుల పాలిట ‘ విలన్లు ‘ గా మారాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఒకప్పుడు ఆరోగ్య రంగంలో ప్రాక్టో సక్సెస్ స్టోరీలు చాలానే ఉండేవి. ఇండియాతో బాటు పలు దేశాల్లో ఈ కంపెనీ విస్తరించింది. ఇప్పుడు మాత్రం.. ఈ సంస్థకు సంబంధించిన ‘ కొత్త విషయాలు ‘ తెలిసి, వైద్య రంగం విస్తుపోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *