వరద నష్టంపై బీమా సంస్థలకు మార్గదర్శకాలు

భారీగా పంట, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో.. బీమా రెగ్యులేటర్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) బుధవారం బీమా సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది.

  • Balaraju Goud
  • Publish Date - 12:32 pm, Thu, 22 October 20

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విలవిలలాడాయి. వందలాది కాలనీలు నీట మునిగాయి. భారీగా పంట నష్టం, ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో.. బీమా రెగ్యులేటర్, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డిఎఐ) బుధవారం బీమా సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేసింది. “అర్హత కలిగిన క్లెయిమ్‌ల తక్షణ రిజిస్ట్రేషన్ ద్వారా పరిష్కారించి బీమా భాదితుల కష్టాలను తగ్గించడానికి భీమా పరిశ్రమ తక్షణ చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపింది.

అలాగే వరదల్లో గల్లంతైన వారి మృతదేహాన్ని తిరిగి పొందలేకపోవడం వల్ల మరణ ధృవీకరణ పత్రం పొందడం కష్టంగా ఉన్న చోట, జమ్మూ కాశ్మీర్ వరదల విషయంలో అనుసరించిన విధానాన్ని పరిగణించవచ్చని బీమా రెగ్యులేటర్ పేర్కొంది.

కొత్త విడుదల చేసిన సర్క్యులర్ ప్రకారం, నోడల్ అధికారులుగా వ్యవహరించడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులను నామినేట్ చేయాలని ఐఆర్‌డిఎఐ సూచించింది. అర్హత ఉన్న అన్ని క్లెయిమ్‌ల రశీదు, ప్రాసెసింగ్ పరిష్కారాన్ని సమన్వయం చేయాలని బీమా సంస్థలకు సూచించింది. నోడల్ అధికారులను సంప్రదించిన క్లెయిమ్స్ వివరాలను పత్రికలలో ప్రచారం చేయాలని కోరింది. భీమా క్లెయిమ్స్ పరిష్కారానికి తగిన సంఖ్యలో సర్వేయర్లను నిమగ్నం చేయాలని, నిర్ణీత కాలపరిమితిలో చెల్లింపులు చేయాలని పేర్కొంది.