పరాగ్ మెరిశాడు..రాజస్థాన్ గెలిచింది

ఎట్టకేలకు రాజస్థాన్‌ మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయిన స్మిత్‌ సేన ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోయింది. అయితే, ఈ విజయంతో మళ్లీ యథావిధిగా తన ఏడో స్థానంలోకి చేరుకుంది. గురువారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు అజింకా రహానే, సంజూ శాంసన్ మంచి శుభారంభాన్ని అందించారు. […]

పరాగ్ మెరిశాడు..రాజస్థాన్ గెలిచింది
Follow us

|

Updated on: Apr 26, 2019 | 4:27 PM

ఎట్టకేలకు రాజస్థాన్‌ మరో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయిన స్మిత్‌ సేన ఇప్పటికే దాదాపు ప్లే ఆఫ్‌ అవకాశాలు కోల్పోయింది. అయితే, ఈ విజయంతో మళ్లీ యథావిధిగా తన ఏడో స్థానంలోకి చేరుకుంది. గురువారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  176 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఓపెనర్లు అజింకా రహానే, సంజూ శాంసన్ మంచి శుభారంభాన్ని అందించారు. 5.1 ఓవర్లలోనే 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రహానే (21 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు) అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 22 పరుగులు చేసిన సంజూ శాంసన్‌ను పియూష్ చావ్లా అవుట్ చేయగా…స్టీవ్ స్మిత్‌ను 2 పరుగులకే పెవిలియన్ చేర్చాడు నరైన్. ఆ తర్వాత బెన్ స్టోక్స్ కూడా 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. స్టువర్ట్ బిన్నీ 11, శ్రేయాస్ గోపాల్ 18 చేసి అవుట్ అయ్యారు. 123 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్, ఇక గెలవడం కష్టమే అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. అయితే యంగ్ క్రికెటర్ రియాన్ పరాగ్… అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. అయితే విజయానికి 8 బంతుల్లో 9 పరుగులు కావల్సిన దశలో రస్సెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు రియాన్ పరాగ్. దాంతో స్టేడియంలో ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాతి ఓవర్‌లో వరుసగా ఓ ఫోర్, సిక్స్ బాదిన ఆర్చర్… రాజస్థాన్ రాయల్స్‌కు విజయాన్ని అందించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు ఆర్చర్.

అంతకుముందు టాస్ ఓడి, బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు నమోదుచేసింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన మొదటి ఓవర్‌ మూడో బంతికే క్రిస్‌లీన్ వికెట్ కోల్పోయింది కోల్‌కతా. ఆరోన్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు క్రిస్‌లీన్. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ 14 పరుగులు, నితీశ్ రాణా 21 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. 42 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కోల్‌కతా. సునీల్ నరైన్ 11 పరుగులు చేసి రనౌట్ కాగా, భారీ హిట్టర్ ఆండ్రే రస్సెల్ 14 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత బ్రాత్‌వైట్ కూడా 5 పరుగులకే అవుట్ అయ్యాడు. అప్పటికి 17.2 ఓవర్లలో జట్టు స్కోరు 131 పరుగులు మాత్రమే. కోల్‌కతా 150 మార్క్ కూడా దాటదనుకున్న సందర్భంలో దినేశ్ కార్తీక్ రెచ్చిపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా దూకుడు కొనసాగించి, 50 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 97 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు దినేశ్ కార్తీక్. రింకూతో కలిసి చివరి 16 బంతుల్లో 44 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు దినేశ్ కార్తీక్.