ఆయన దిగారు.. ఈయనెక్కారు.. మతలబేంటనేదే అసలు మేటర్

విశాఖ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు, బాధితులకు అండాదండా అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరే ముందు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పలువురి మధ్య చర్చనీయాంశమైంది.

ఆయన దిగారు.. ఈయనెక్కారు.. మతలబేంటనేదే అసలు మేటర్
Follow us

|

Updated on: May 07, 2020 | 5:23 PM

విశాఖ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసేందుకు, బాధితులకు అండాదండా అందించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరే ముందు జరిగిన ఓ ఆసక్తికర సంఘటన ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో పలువురి మధ్య చర్చనీయాంశమైంది. అసలేం జరిగింది అనే దానితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో భిన్నకథనాలు రావడం నెటిజన్ల మధ్య వదంతులకు తెరలేపింది. విశాఖకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ కారు నుంచి వైసీపీలో అత్యంత కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎందుకు దిగిపోయారు? దాని వెనుక ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని పాత్ర ఏమైనా వుందా? అసలు ముఖ్యమంత్రి ఎవరిని తన వెంట తీసుకువెళదామనుకున్నారు? చివరికి ఎవరిని తీసుకువెళ్ళారు? దానికి కారణాలేంటి? ఇవిప్పుడు సోషల్ మీడియాలో జోరందుకున్న ప్రశ్నలు కాగా.. విషయం చినికి చినికి వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధానికి తెరలేపే దిశగా కదులుతోంది.

గురువారం ఉదయాన్నే నిద్ర లేచిన తెలుగు ప్రజానీకానికి విశాఖ గ్యాస్ లీకేజీ విషాదమే ప్రధాన వార్తగా ముందుకు వచ్చింది. కరోనా వైరస్ కారణంగా ఇంకో న్యూస్ ఏదీ లేదన్నట్లుగా పరిస్థితి తయారు కాగా.. విశాఖ దుర్ఘటన అందరి దృష్టినీ కరోనా మీద నుంచి మళ్ళించింది. సహజంగానే విశాఖ విషవాయువు ఉదంతంపై రాజకీయ నాయకుల హడావిడి కూడా మొదలైంది. సంఘటన పూర్తిగా ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యమేనని రాజకీయ పక్షాలన్నీ ముక్తకంఠంతో ఆరోపించాయి. ఇక్కడి వరకు బాగానే వుంది. విశాఖలో పరిస్థితిని తెల్లవారుజామునుంచి సమీక్షిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. తాను స్వయంగా విశాఖకు తరలి వెళ్ళి బాధితులను ఓదార్చాలని తలపెట్టారు. ముందుగా తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని, ప్రాణనష్టం పెరగ కుండా వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

సమీక్ష తర్వాత జగన్ విశాఖ బయలుదేరారు. ఆయన కారు దగ్గరికి వచ్చేసరికే కారులో ఎంపీ విజయసాయి రెడ్డి కూర్చుని వున్నారు. సీఎం వెంట వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని కాసేపు కారు విండో దగ్గరనే వుండి మాట్లాడారు. ఇంతలోనే కారు వెనక సీటులోంచి విజయసాయి దిగిపోవడం.. ఆ వెంటనే ఆళ్ళ నాని కారులో కూర్చుని సీఎం వెంట వెళ్ళడం జరిగిపోయాయి. ఈ ఉదంతమే సోషల్ మీడియాలో రకరకాల కథనాలు రాయడానికి వీలు కలిగించింది. అయితే, విజయసాయిని సీఎం దిగిపొమ్మనడంతోనే ఆయన దిగిపోయరని, దాంతో సీఎంతో ఆళ్ళ నాని వెళ్ళారని కథనాలు మొదలయ్యాయి. మరికొందరైతే విజయసాయిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారంటూ రాసేశారు.

అయితే, అసలు విషయాన్ని కూపీ లాగింది టీవీ9. దానిపై ఆళ్ళ నాని కూడా స్పందించడంతో అసలు నిజమేంటో వెలుగులోకి వచ్చినట్లయ్యింది. కానీ ఈపాటికే సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి. విజయసాయికి అవమానమంటూ టీడీపీ నేతలే కథనాలు రాయించారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలింతకూ ఏం జరిగింది?

సీఎంతో పాటు ఆళ్ళ నాని రావడం గమనించిన విజయసాయి రెండంశాల కారణంగా కారు దిగిపోయారని తెలుస్తోంది. ఒకటి ఆళ్ళనాని రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. అదే సమయంలో వైద్య, ఆరోగ్య శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు. కరోనా నియంత్రణా చర్యలతోపాటు తాజాగా విశాఖ దుర్ఘటనలో ఆసుపత్రుల పాలైన వారికి చికిత్సనందించే అంశాలను ఆళ్ళనాని పర్యవేక్షిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా ఆయన నిరంతరం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరపాల్సి వుంటుంది. విశాఖలో కొనసాగుతున్న చికిత్సకు సంబంధించి కూడా ఆయనే సంబంధిత మంత్రి. మరోవైపు కరోనా ప్రభావంతో అటు కారులోను, ఇటు హెలికాప్టర్‌లోను భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకున్న విజయసాయి రెడ్డి.. తనకంటే కూడా ఆళ్ళ నాని సీఎంతో పాటు వెళ్ళడం అత్యంత ముఖ్యమని భావించారు. అందుకే ఆయన కారు దిగిపోయా ఆళ్ళనానిని సీఎం వెంట పంపించారన్నది కచ్చితమైన సమాచారం. తనకంటే సీనియర్ అయిన విజయసాయిరెడ్డి.. అత్యంత కీలకమైన తరుణంలో తనపై వున్న బాధ్యతను గౌరవించి, తగిన విధంగా తనకు అవకాశం ఇచ్చారని ఆళ్ళనాని స్వయంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి హుందాతనానికి నాని ఫిదా అయ్యారని చెప్పుకుంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే వున్నా.. ఈ విషయంలో సోషల్ మీడియా చేసిన హడావిడి మాత్రం రెండు పార్టీల మధ్య మాటల యుద్దానికి, తెరచాటు వ్యాఖ్యానాలకు, అనవసర రాద్ధాంతానికి దారి తీసిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.