అమెరికా లో భారత సంతతి డాక్టర్ దంపతుల మృతి

indian origin doctor couple, their daughter killed in small plane crash in us

భారత సంతతికి చెందిన డాక్టర్ దంపతులు, వారి కుమార్తె అమెరికాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. వీరు ప్రయాణిస్తున్న చిన్న విమానం గురువారం ఉదయం ఫిలడెల్ఫియా శివారులో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 60 ఏళ్ళ డాక్టర్ జస్వీర్ ఖురానా, ఆయన భార్య 54 ఏళ్ళ డాక్టర్ దివ్య ఖురానా, వారి 19 సంవత్సరాల కూతురు కిరణ్ ఖురానా మృతి చెందారు. ఈ దంపతుల మరో కుమార్తె వీరితో బాటు విమానంలో ప్రయాణించకపోవడంతో ప్రాణాలు దక్కించుకుంది. లైసెన్స్డ్ పైలట్ అయిన ఖురానాకు విమానాలు నడపడంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఢిల్లీ లోని ఎయిమ్స్ లో శిక్షణ పొందిన జస్వీర్, దివ్య ఇద్దరూ సుమారు రెండు దశాబ్దాల క్రితమే యుఎస్ వెళ్లారు. అక్కడి ఆసుపత్రుల్లో రోగులకు వైద్య సేవలు అందిస్తూ వచ్చారు. ఫిలడెల్ఫియా ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన వీరి విమానం.. కొలంబస్ లోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ వైపు వెళ్తూ.. శివారులో కూలిపోయినట్టు తెలుస్తోంది. స్థానికులనుంచి 911 కాల్ రావడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఈ ముగ్గురి మృత దేహాలను గుర్తించారు. జనావాసాల మధ్య ఈ విమానం కూలిపోవడం ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు. బహుశా జశ్వీర్ ఆ సమయంలో ఏదో ఆలోచిస్తూ ఫ్లైట్ ను నడిపి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్ఛునని పోలీసులు భావిస్తున్నారు. తమకెంతో ఆప్తుడైన డాక్టర్ జస్వీర్ తో బాటు ఆయన భార్య, వారి కూతురు ఈ ప్రమాదంలో మరణించడాన్ని ఈ కుటుంబ సన్నిహితులు, వీరి స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *