భారతీయ ప్రమాణాలు పాటించని హెల్త్ యాప్స్.. అంతా తికమక !

, భారతీయ ప్రమాణాలు పాటించని హెల్త్ యాప్స్.. అంతా తికమక !

వెయిట్ లాస్ (శరీర బరువు తగ్గేందుకు), కేలరీలు తగ్గించుకునేందుకు ఉపయోగపడే 20 మొబైల్ యాప్స్ లో 13 యాప్స్ భారతీయ సిఫారసులకు అనుగుణంగా లేవని తేలింది. ఈ వేర్వేరు యాప్ లు వేర్వేరు సూచనలు ఇస్తున్నందున మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని తెలిసింది. ఈ యాప్ లపై పరిశోధనలు నిర్వహించిన నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ విషయాలను వెల్లడిస్తూ.. ఇందుకు సంబంధించిన వివరాలను హెల్త్ ఇన్ఫర్మాటిక్స్ జర్నల్ లో ప్రచురించింది. సాధారణంగా స్థూలకాయులు తమ బరువు తగ్గడానికి ఈ యాప్ లపై ఆధారపడుతుంటారు. అవి ఇచ్ఛే సూచనలను పాటిస్తుంటారు. కానీ ఇవి ఇస్తున్న ఈ సూచనలు గందరగోళంలో పడేస్తున్నాయని ఈ సంస్థ పేర్కొంది. భారతీయ సిఫారసులను ఆధారంగా చేసుకుని ఈ సంస్థ.. 2016-17 మధ్య కాలంలో ఓ స్టడీ నిర్వహించింది. అసలు ఇండియన్ ప్రమాణాలు ఒకరకంగా ఉంటే… ఈ యాప్ లు నిర్దేశించినవి మరొకరకంగా ఉన్నాయని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కు చెందిన పరిశోధకుడు జి. సుబ్బారావు తెలిపారు. తాము ప్రతి యాప్ కు సంబంధించి ఓ నిర్ధారణకు వచ్ఛే ముందు శాస్త్రీయ సమాచారాన్ని, ఆయా వ్యక్తుల డేటా బేస్ ను, వారి ప్రవర్తన అంశాలను, టెక్నాలజీ ఫీచర్స్ ను అధ్యయనం చేసినట్టు ఆయన చెప్పారు.
ఈ యాప్ లలో 13 యాప్ ల క్వాలిటీ నాసిరకంగా (70 శాతం కన్నా తక్కువగా) ఉందని, ఏడు యాప్ లు శాస్త్రీయంగా ఆమోదించిన డేటాను వినియోగించలేదని సుబ్బారావు పేర్కొన్నారు. ఓ వ్యక్తి జీవన సరళి, అతని కేలరీ అవసరాలను ఇవి పరిగణనలోకి తీసుకున్నట్టు కనబడలేదన్నారు. ఈ వ్యక్తి అన్ని యాప్ లను వాడితే… ఇవి వేర్వేరు సూచనలిచ్చాయని, చాలా గందరగోళానికి గురి చేశాయని ఆయన అన్నారు. ప్రతి యాప్ భిన్న రకాల సూచనలు ఇవ్వడంలోని ఔచిత్యాన్ని ఆయన ప్రశ్నించారు. ఇంతేకాదు.. పండ్లు, కూరగాయలను వ్యక్తులు ఆహారంగా స్వీకరించే అలవాట్లపైనా వీటిలో 40 శాతం మాత్రమే తగిన సూచనలు ఇఛ్చిన విషయాన్ని ఈ సంస్థ తమ అధ్యయనంలో విశ్లేషించింది.
ప్రస్తుతమున్న యాప్ లు ఓవర్ ఎస్టిమేట్.. లేదా అండర్ ఎస్టిమేట్ యాప్ లుగా ఉన్నాయి. భారతీయ డైట్ అలవాట్లకు ఇవి అనుగుణంగా లేవు. కానీ భారతీయులు తమకు అనువుకాని వీటిని స్వేఛ్చగా వాడుతున్నారు అని సుబ్బారావు వ్యాఖ్యానించారు.కేలరీ కౌంటింగ్  యాప్ లు వెయిట్ లాస్ కు అనుగుణమైన సిఫారసులు చేయడంలేదని ఈ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్. హేమలత అభిప్రాయపడ్డారు. ఫుడ్ డేటా విషయంలో సముచిత సూచనలు ఉండాలని ఆమె అన్నారు. వీటిలో ‘ ఫారిన్ ఇంపాక్ట్ ‘ ఎక్కువగా ఉన్నట్టు ఆమె అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *