స్పేస్ లో ఇదో విచిత్రం ! కక్ష్యలో ఏం జరుగుతోంది ?

భారత్ ఆ మధ్యప్రయోగించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి భాగాలు ఇంకా భూ కక్ష్యలో… గాల్లో తేలియాడుతున్నాయట. హార్వర్డ్ స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఏస్ట్రోఫిజిక్స్ నిపుణుడు జోనాథన్ మెక్డొవెల్ ఈ సంచలన విషయాన్ని ప్రకటించారు. మొదట దీన్ని ప్రయోగించినప్పుడు దీని భాగాలన్నీ 45 రోజుల్లోగా నాశనమవుతాయని, లేదా కనిపించకుండాపోతాయని డీఆర్డీఏ పేర్కొంది. అయితే ప్రయోగించి 92 రోజులు గడిచినా ఈ ముక్కలు ఇంకా అలాగే కనిపించడం విడ్డూరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ క్షిపణి భాగాలు చాలావరకు తిరిగి భూమిపై పడిపోయినప్పటికీ.. పలు భాగాలు అలాగే ఉన్నాయని., కానీ ఇవి బహుశా ఏడాదిలోగా అదృశ్యం కావచ్చ్చునని జోనాథన్ మెక్డొవెల్ అంటున్నారు. నిజానికి అంత కాలం పట్టదన్న భారత శాస్త్రజ్ఞుల అంచనాను ఇది తారుమారు చేస్తోంది.
యాంటీ శాటిలైట్ టెస్ట్ ద్వారా ఉత్పన్నమైన శిథిల భాగాలన్నీ త్వరలోనే అదృశ్యమవుతాయని డీఆర్ డీఓ చైర్మన్ జి.సతీష్ రెడ్డి గత నెలలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలిపారు. కాగా-ఈ టెస్టును నాసా ‘ టెరిబుల్ థింగ్ ‘ గా అభివర్ణించింది. ఈ ప్రయోగం వల్ల కక్ష్యలో సుమారు 400 ముక్కలు ఏర్పడ్డాయని, ఇది వ్యోమగాములకు ప్రమాదకరమని నాసా శాస్త్రజ్ఞులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగాల వల్ల రోదసి అంతా ఇలాంటి ముక్కలతో నిండిపోతుందని, స్పేస్ పొల్యూషన్ తీవ్రమవుతుందని అమెరికా వంటి దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. నాసా కేంద్రం నుంచి ఎన్ని శాటిలైట్లను ప్రయోగించినా కిమ్మనని ట్రంప్ ప్రభుత్వం ఇండియా వంటి వర్ధమాన దేశాలు అంతరిక్ష ప్రయోగ టెక్నాలజీని మరింత అభివృద్ద్ధి పరచుకుంటే మాత్రం అసూయ పడుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *