చెలరేగిన టీమిండియా… ఆసీస్ ఎదుట భారీ లక్ష్యం

India, చెలరేగిన టీమిండియా… ఆసీస్ ఎదుట భారీ లక్ష్యం

ఐసీసీ ప్రపంచకప్ 2019లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చెలరేగిపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించింది. రోహిత్‌తో మొదలుపెట్టి లోకేశ్ రాహుల్ వరకు క్రీజులోకి వచ్చినవారు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. తొలుత ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధవన్‌లు శుభారంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 127 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్(57) అర్ధ సెంచరీ చేసి అవుటగా, ధవన్ చెలరేగిపోయాడు. 109 బంతుల్లో 16 ఫోర్లతో 117 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కెప్టెన్ కోహ్లీతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 27 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 48 పరుగులు చేశాడు. మరోవైపు, కోహ్లీ కూడా బంతులను బౌండరీలకు పంపుతూ సెంచరీకి చేరువయ్యాడు. 77 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేసిన కోహ్లీ.. స్లోయినిస్ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

మరోవైపు ధోనీ కూడా మునుపటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 14 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 27 పరుగులు చేసి సోయినిస్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన లోకేశ్ రాహుల్ మూడు బంతుల్లో సిక్సర్, ఫోర్‌తో 11 పరుగులు పిండుకోవడంతో భారత్ భారీ స్కోరు సాధింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి ప్రత్యర్థి ఆసీస్ ఎదుట భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *