డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్‌పై సఫారీల ఘనవిజయం

India lost 3rd T20I Against South Africa, డికాక్ కెప్టెన్ ఇన్నింగ్స్.. భారత్‌పై సఫారీల ఘనవిజయం

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆఖరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియాపై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది. శిఖర్ ధావన్ 36 పరుగులు చేసి అవుటయ్యాడు. రిషబ్ పంత్ (19), రవీంద్ర జడేజా (19), హార్దిక్ పాండ్యా (14) మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్ చేశారు. రోహిత్ శర్మ (9), కోహ్లీ (9), శ్రేయాస్ అయ్యర్ (5), కృనాల్ పాండ్యా (4), సుందర్ (4) పరుగులు మాత్రమే చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు పడగొట్టాడు. ఫోర్టిన్, హెండ్రిక్స్ చెరో రెండు వికెట్లు తీశారు.

ఇక 135 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీలు.. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించారు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన డికాక్ 79 పరుగులు ( 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. ప్రారంభం నుంచే భారత బౌలర్లపై డికాక్‌ విరుచుకుపడ్డాడు. హెండ్రిక్స్‌ (28)తో కలిసి డికాక్‌ తొలి వికెట్‌కు 76 పరుగులు చేశాడు. ఆ తర్వాత హార్దిక్‌ బౌలింగ్‌లో హెండ్రిక్‌ ఔటవ్వడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన బవుమాతో కలిసి కెప్టెన్ డికాక్ టార్గెట్‌ను16.5 ఓవర్లలోనే పూర్తిచేశాడు. కాగా, అక్టోబర్‌ 2 నుంచి ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *