పంద్రాగస్టు తర్వాత టీమిండియా కోచ్ ఎంపిక?

India head coach interview likely after Independence Day

ప్రపంచకప్ తర్వాత టీం ఇండియా కోచ్‌, సపోర్టింగ్ స్టాఫ్ పదవుల కోసం బీసీసీఐ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. భారత జట్టు కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన అందరినీ వడబోసి సుమారు ఆరు మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారని సమాచారం. అయితే ఈ ఇంటర్వ్యూలు ఆగస్టు 13, 14వ తేదీల్లో జరగాలి. కానీ పేపర్‌ వర్క్‌ ఇంకా మిగిలి ఉండటంతో ఆగస్టు 15 తర్వాత ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఒకే రోజులో ఇంటర్వ్యూ ప్రక్రియను పూర్తిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘తొలుత ఇంటర్వ్యూలను ఆగస్టు 13, 14వ తేదీల్లో నిర్వహించాలని భావించాం. ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసిన అభ్యర్థులలో సుమారు ఆరు మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశాం. వారికి ఇంటర్వ్యూ చేయడానికి ఒక రోజు సరిపోతుంది. పేపర్‌ వర్క్‌ మిగిలి ఉండటంతో ప్రక్రియ వాయిదా వేయాల్సి వస్తుంది. ఆగస్టు 15 లోపు ఈ ప్రక్రియ జరగదు. కోచ్‌ ఎంపికపై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అభిప్రాయాన్ని తీసుకోవట్లేదు. క్రికెట్‌ సలహా కమిటీ టీమిండియా కోచ్‌ను ఎంపిక చేస్తుంది. భారత మహిళా జట్టు కోచ్‌ ఎంపిక ప్రక్రియ మాదిరిగానే ఇది నిర్వహిస్తున్నాం.’ అని వెల్లడించాయి.

క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) టీమిండియా కోచ్‌ను ఎంపిక చేయనుంది. కపిల్‌దేవ్, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామి బృందం ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. కోచ్‌ ఎంపిక గురించి భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తన అభిప్రాయాన్ని వెస్టిండీస్ పర్యటనకు బయలు దేరడానికి ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపాడు. ‘రవి భాయ్‌తో మా అందరికీ మంచి బంధం ఉంది. అతణ్నే కోచ్‌గా కొనసాగిస్తే చాలా సంతోషిస్తాం. కానీ కోచ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్‌ సలహా కమిటీనే. ఈ విషయంపై సీఏసీ ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు. నా అభిప్రాయం అడిగితే చెబుతా’ అని కోహ్లీ పేర్కొన్నాడు. విండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు భారత్‌ రెండో వన్డేను పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో ఆడనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *