ఇండియా, చైనా వర్ధమాన దేశాలు కావట..ట్రంప్ జెలసీ !

india china not growing but grown economies trump slams wto status

ఇండియా, చైనా ఇకపై వర్ధమాన దేశాలు కావని, అవి ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నుంచి ప్రయోజనాలు పొంది బలమైన ఆర్ధిక దేశాలుగా ఎదిగాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే ఈ ధోరణికి తాను ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని విరుచుకపడ్డారు. అన్ని దేశాల్లో కన్నా అమెరికాదే ఫస్ట్ పాలసీ అనే నినాదాన్ని నెత్తికెత్తుకున్న ట్రంప్.. ముఖ్యంగా ఇండియాపై చెలరేగిపోయారు. తమ దేశ ఉత్పత్తులపై భారత్ భారీగా సుంకాలు పెంచి ‘ టారిఫ్ కింగ్ ‘ గా అవతరించిందని ఆయన గతంలోనూ దుయ్యబట్టారు. మంగళవారం పెన్సిల్వేనియాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. బలమైన ఆర్థిక దేశాలుగా ఎదుగుతున్న ఇండియా, చైనా …. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి ఇక ప్రయోజనాలు పొందజాలవన్నారు. ఈ దేశాలు తమ దేశానికి ‘ అసౌకర్యం ‘ కలిగేట్టుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నుంచి ‘ వర్ధమాన దేశమనే ‘ ముద్రను కొనసాగించుకుంటున్నాయని, దీనివల్ల అమెరికాకు ఏళ్ళ తరబడి’ అన్యాయం ‘ జరుగుతోందని ట్రంప్ ‘ వాపోయారు ‘. గ్లోబల్ ట్రేడ్ రూల్స్ ప్రకారం.. అభివృద్ది చెందుతున్న దేశాలు తరచూ ప్రపంచ వాణిజ్య సంస్థ విధించే ఆంక్షల కాల పరిమితి, సాప్టర్ టారిఫ్ కట్స్ తదితరాల నుంచి దీర్ఘకాల పొడిగింపు అనుమతులను కోరే హక్కును పొంది ఉన్నాయి. పైగా కొన్ని ఎగుమతులపై సబ్సిడీలను పొందడానికి కూడా ఈ దేశాలకు అర్హత ఉంది.
ఇప్పటికైనా గ్లోబల్ వాణిజ్య సంస్థ తమ దేశానికి ‘ న్యాయం ‘ కలిగేలా చూస్తుందని ఆశిస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ‘ మేం తప్ప, అందరూ (అన్ని దేశాలూ) ఎదిగిపోతున్నారు ‘ అని ఆయన ఆక్రోశించారు.
అసలు వర్ధమాన దేశమనే స్టేటస్ ను మీరెలా నిర్ణయిస్తారని ఆయన గత జులైలోనే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ను ప్రశ్నించారు. ఇండియా, చైనా, టర్కీ వంటి వర్ధమాన దేశాలను దృష్టిలో ఉంచుకునే ట్రంప్ ఈ వ్యాఖ్య చేసినట్టు కనబడుతోంది. ధనిక (అభివృధ్ది చెందిన) దేశాలేవైనా ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి అనుచితంగా ప్రయోజనాలు పొందితే శిక్షార్హ చర్యలు తీసుకోవాలని ఆయన యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కు అధికారాలను కల్పిస్తూ ఓ మెమోరాండం జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *