ఐటీ రిటర్న్‌లకు నేడే చివరి రోజు.. సోషల్ మీడియా పుకార్లు నమ్మకండి

Income tax return filing deadline not extended again.. clarifies tax department, ఐటీ రిటర్న్‌లకు నేడే చివరి రోజు.. సోషల్ మీడియా పుకార్లు నమ్మకండి

ఐటీ రిటర్న్‌ల ఫైలింగ్ గడువు నేటితో ముగియనుంది. అయితే ఆదాయపు రిటర్నులు దాఖలుకు గడువు పెంచుతున్నట్టు వచ్చిన వార్తల్ని ఐటీ శాఖ ఖండించింది. సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలన్నీ తప్పుడు వార్తలేనని స్పష్టం చేస్తూ ట్వీట్‌ కూడా చేసింది. 2019-20 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పణకు గడువు ఈరోజుతో ముగియనుందని స్పష్టం చేసింది. పన్ను చెల్లింపుదారులు ఈ లోపే తమ రిటర్న్‌లను ఫైల్‌ చేయాలని కోరింది. లేకపోతే ఫైన్‌తో వచ్చే ఏడాది మార్చి 31లోగా రిటర్న్‌లు ఫైల్‌ చేయాలి. సంవత్సర ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారు ఉండి వచ్చే ఏడాది మార్చి 31లోపు రిటర్న్‌ ఫైల్‌ చేస్తే రూ.1,000 వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ వార్షిక ఆదాయం రూ.5 లక్షలపైన ఉండి ఈ సంవత్సరం డిసెంబరు 31లోగా రిటర్న్‌ ఫైల్‌ చేస్తే రూ.5,000, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య ఫైల్‌ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించాల్సి వస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్నుల దాఖలు చేసేందుకు మరింత గడువు ఇచ్చిందని.. రిటర్నులు దాఖలు చేసేందుకు మరో నెల రోజులు (సెప్టెంబర్‌ 30) వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది. దీంతో ఆ లేఖ విషయం ఐటీ శాఖ దృష్టికి వెళ్లింది. అప్రమత్తమైన ఐటీ శాఖ అధికారులు ఆ లేఖలో ఉన్న సమాచారం అంతా తప్పు అని తెలిపారు. ఆ లేఖ ఐటీ శాఖ విడుదల చేయలేదని తెలిపారు. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31. అయితే రిటర్నులు దాఖలు చేసేటప్పుడు సమస్యలు తలెత్తుతున్నాయని, గడువు తేదీని పెంచాలని పలు వర్గాల నుంచి అభ్యర్థనలు రావడంతో రిటర్నుల దాఖలుకు ఆగస్టు 31 వరకు సమయమిచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *