రూ.500 లకే కరోనా టెస్ట్… ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల ఘనత

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. అటు కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు సామాన్యుడికి భారంగా మారుతుంది. దీంతో అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారించే విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు కనుగొన్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:28 pm, Wed, 21 October 20

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడంలేదు. అటు కొవిడ్ పరీక్షలు చేయించుకునేందుకు సామాన్యుడికి భారంగా మారుతుంది. దీంతో అతి తక్కువ ఖర్చుతో కొవిడ్‌-19 వ్యాధి నిర్ధారించే విధానాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు కనుగొన్నారు. ‘కొవిరాప్‌’ అనే ఈ పరికరం ఖరీదు కేవలం రూ.10,000 కాగా.. దీని ద్వారా ఒకసారి పరీక్ష చేసేందుకు రూ.500 ఖర్చు అవుతుందని తెలిపారు.

ఐఐటీ ఖరగ్‌పూర్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు సుమన్‌ చక్రబర్తి, డాక్టర్‌ అరిందమ్‌ మొండెల్‌ల నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ ఘనతను సాధించారు. కాగా, ఈ విధానానికి ఐసీఎంఆర్‌ అనుమతి కూడా లభించటం విశేషం. ఈ విధానం సులభమే కాకుండా.. ఒక గంట వ్యవధిలోనే కచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

ఆత్మనిర్భర్‌ భారత్‌ లక్ష్యంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌ విద్యార్థుల వైద్య ఆవిష్కరణ ప్రశంసనీయమని.. కేంద్ర విద్యా మంత్రి రమేశ్ పోఖ్రియాల్‌ నిశాంక్‌ అన్నారు. కనీస శిక్షణతో గ్రామీణ యువత కూడా ఉపయోగించగల ఈ పరికరం శక్తి వినియోగం కూడా చాలా తక్కువని ఆయన వెల్లడించారు. ఎక్కడికైనా తరలించేందుకు అనువుగా ఉండే ఈ పరికరం అనేక గ్రామీణ ప్రజల ప్రాణాలు నిలబెడుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

వైద్య విభాగం వైరాలజీ చరిత్రలోనే ఇదో గొప్ప ముందడుగని.. ఈ విధానాన్ని ప్రస్తుతం వాడుతున్న పీసీఆర్‌ ఆధారిత పరీక్షా విధానంతో మార్పుచేయచ్చని ఐఐటీ ఖరగ్‌పూర్‌ డైరక్టర్‌ వీకే తివారీ తెలిపారు. తమ కొవిరాప్‌ పరికరానికి పేటెంట్‌ హక్కులను పొందిన అనంతరం భారీ ఎత్తున తయారీ సాధ్యమౌతుందన్నారు. అవసరమైతే వివిధ సంస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధమని ఆయన తెలిపారు.