ఐసీసీ వరల్డ్ కప్ 2019: క్రిస్‌గేల్ vs అంపైర్

ICC, ఐసీసీ వరల్డ్ కప్ 2019: క్రిస్‌గేల్ vs అంపైర్

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2019 టోర్నీలో అంపైర్ల తప్పిదాలపై విమర్శలు మొదలయ్యాయి. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య గురువారం రాత్రి ముగిసిన మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ క్రిస్‌ గాఫనీ మూడు సందర్భాల్లో తడబడ్డాడు.

వివరాల్లోకెళితే… 289 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ క్రిస్‌గేల్ (21: 17 బంతుల్లో 4×4) దూకుడుగా ఆడుతుండగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌కి వచ్చాడు. ఈ క్రమంలో అతను విసిరిన ఐదో బంతిని హిట్ చేయడంలో గేల్ విఫలమవగా.. బంతి నేరుగా వెళ్లి అతని ప్యాడ్స్‌ని తాకింది. దీంతో.. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ క్రిస్‌ గాఫనీ వేలెత్తేశాడు. కానీ.. ఈ నిర్ణయంపై అనుమానం వ్యక్తం చేసిన గేల్ డీఆర్‌ఎస్ కోరాడు. రీప్లేలో వికెట్లకి దూరంగా బంతి వెళ్తున్నట్లు తేలడంతో అంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత బంతికి మళ్లీ స్టార్క్ అప్పీల్ చేయడం, గేల్ సమీక్ష కోరడం, వికెట్లకి దూరంగా బంతి వెళ్లడం అంపైర్ నిర్ణయం మార్చుకోవడం జరిగింది.

ఆ ఓవర్‌ తర్వాత మళ్లీ స్టార్క్ ఐదో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చాడు. ఈసారి కూడా ఐదో బంతికి ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా.. క్రిస్‌ గాఫనీ వేలెత్తేశాడు. మళ్లీ గేల్ రివ్యూ కోరగా.. ఈసారి బంతి లెగ్‌స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్తున్నట్లు రీప్లేలో కనిపించింది. దీంతో.. అంపైర్ తన మునుపటి నిర్ణయానికే కట్టుబట్టాడు. కానీ.. ఈ బంతి కంటే ముందు స్టార్క్ క్రీజు నోబాల్ విసిరినట్లు మ్యాచ్ మధ్యలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్స్‌పై దర్శనమిచ్చింది. ఒకవేళ ఆ బంతిని నోబాల్‌గా అంపైర్ ప్రకటించి ఉంటే.. క్రిస్‌గేల్ ఔటైన బంతి ఫ్రీ హిట్‌గా మారేది. అప్పుడు గేల్ నాటౌట్‌గా మిగిలేవాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకూ పోరాడిన వెస్టిండీస్ జట్టు 273/9కే పరిమితమై ఓడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *