Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

గుణపాఠం నేర్చుకోలేమా ఇకనైనా ?

అంచనాలకు, జ్యోతిష్యాలకు మించి ప్రభావం చూపిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు బాగానే న్యాయం చేశాయి. మరీ ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో వానలు దంచి కొడుతున్నాయి. పడికట్టు భాషలో చెప్పాలంటే లోతట్టు ప్రాతాలన్నీ తరచు జలమయం అవుతున్నాయి. 2000 లో కురిసిన భారీ వర్షాలు అప్పట్లో ప్రభుత్వానికి, జిహెచ్ఎంసి అధికారులకు కొత్త మార్గం అనుసరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపాయి. అప్పట్లో బతుకమ్మ కుంటతో పాటు లోయర్ ట్యాంక్ బండ్, సఫిల్ గూడ ట్యాంక్ బండ్ కింది ప్రాంతాలనీ జలమయం అవడంతో తొలిసారి నగర వీధుల్లో బోట్లలో తిరుగుతూ రిపోర్టింగ్ చేయాల్సి వచ్చింది.

అనూహ్యంగా వచ్చిన భారీ వర్షాలు, ఫలితంగా వచ్చిన వరదలను అంచనా వేయలేకపోయామని అందువల్లే నష్టం భారీగా సంభవించిందని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికార గణం చెప్పి తప్పించుకుంది.. భారీ స్థాయిలో.. దూర దృష్టితో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతీ ఒక్కరూ ప్రకటనల మీద ప్రకటనలిచ్చారు.

కానీ, దాదాపు 20 ఏళ్ళ తర్వాత హైద్రాబాద్లో భారీ వర్ష కురిస్తే అదే పరిస్థితి కనిపిస్తోంది. దీనికి బాధ్యులెవరు ? ఎవరి వైఫల్యం ? ఎవరి నిర్లక్ష్యం ? హైదరాబాద్ ని ఒక ప్రపంచ స్థాయి నగరంగా మార్చమని చెప్పుకునే పాలకులు వర్షం కురిస్తే అడుగు తీసి అడుగు వేయడం కూడా గగనంగా మారే రాజధాని రోడ్లపై ఏమి చెప్తారు ? వేలాది కోట్లు నగరాభివృద్ధికి కేటాయిస్తున్నామనే సర్కార్ ఏం చెబుతుంది ? నిధులన్నీ ఎటు పోయాయని అడిగితే ప్రభుత్వాధినేతల సమాధానం ఏంటి ?

హైదరాబాద్ ను తామే అభివృద్ధి చేశానని చెప్పుకునే గత పాలకులు వర్షం పడితే ఎక్కడికి కక్కడ నిలిచిపోయే వర్షపు నీటిని చూడడం లేదా ? నోళ్లు తెరిచి ప్రాణాలకు హరించే మాన్ హొళ్లను చూస్తూ ఏం చెబుతారు ? అక్కడికక్కడే స్థంభించిపోయే ట్రాఫిక్ లో తాము ఇరుక్కుపోతే గాని ఆ నరక యాతన గురించి పాలకులకు తెలియదేమో కదా ?

ఐటీ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలు వస్తున్నాయి కాబట్టి సైబరాబాద్ ప్రాంతం పై ఫోకస్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మిగితా భాగ్యనగరంపై ఫోకస్ ఏది ? పోనీ సైబరాబాద్ వారిపైన అయినా సరిగ్గా ఫోకస్ చేస్తున్నారా అంటే గంటల తరబడి నిలిచిపోయే ట్రాఫిక్ అక్కడి ప్రజలకు, ఉద్యోగులకు నరక యాతన చూపిస్తున్న విషయం తెలియదా ?

బృహత్తర ప్రణాళిక లేకపోతే ఎన్ని దశాబ్దాలైనా భాగ్యనగర దుస్థితి ఇంతే. ఇది నిష్టుర సత్యం. దూర దృష్టితో ప్రణాళికలు, కచ్చితమైన వైఖరితో రోడ్ల విస్తరణ, అంతే కచ్చితమైన విధానంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం నిర్మించకపోతే భవిష్యత్ తరాలు ఇప్పటి పాలకులను దూరదృష్టి లేని నేతలుగానే చూడక తప్పదు. విశ్వనగరమని మనం భుజాలు చరచుకుంటే సరిపోతే ఆచరణలో విశ్వనగరమని చూపాలి.. నగరాన్ని విజిట్ చేసే ప్రతీ ఒక్కరికీ ఆ భావన కలగాలి. అందుకు ఈ ప్రభుత్వమైనా గట్టి సంకల్పం చూపాలి..