ధూమపాన రహిత నగరంగా భాగ్యనగరం!

హైదరాబాద్‌ను ధూమపాన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బేగంపేటలోని హరిత ప్లాజా హోటల్‌లో శుక్రవారం జిల్లాల వైద్యాధికారులకు వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఆధునిక సమాజంలో పొగాకు ఉత్పత్తుల వినియోగం అలవాటుగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధూమపానం అనర్థదాయకమని తెలిసినా.. ఆ అలవాటును మానలేకపోతున్నారని అన్నారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య సంక్షేమశాఖ కమిషనర్‌ యోగితారాణా మాట్లాడుతూ విద్యాసంస్థలకు దగ్గరలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తే సెక్షన్‌ 6(బీ) ప్రకారం రూ.200, మైనర్లకు సిగరెట్లు, గుట్కాలు అమ్మితే సెక్షన్‌ 6(ఏ) ప్రకారం రూ.200 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలైన బస్టాండ్లు, సినిమా థియేటర్లు, పార్కుల వద్ద నో స్మోకింగ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తుల వల్ల తలెత్తే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం వివిధ జిల్లాల నుంచి వచ్చిన మెడికల్‌ ఆఫీసర్లకు వర్క్‌షాప్‌ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *