ఒక్కరి కోసం స్పెషల్‌ ట్రెయిన్‌ నడిపిన హైదరాబాద్ మెట్రో

సాధారణంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ వేరే మార్గం లేదని వచ్చిన ఆమె కోసం ప్రత్యేకంగా స్పెషల్ సర్వీస్‌ నడిపి గమ్యస్థానానికి చేర్చారు.

ఒక్కరి కోసం స్పెషల్‌ ట్రెయిన్‌ నడిపిన హైదరాబాద్ మెట్రో
Follow us

|

Updated on: Oct 17, 2020 | 5:56 PM

ఒకే ఒక్కరి కోసం మెట్రో సంస్థ – ప్రత్యేక ట్రెయిన్‌ నడిపింది. హైదరాబాద్‌ను ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ… రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా… రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్‌ మెట్రో రైలు పరుగులు తీసింది. మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. అయితే – సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి గర్భిణీని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది.

మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. రోడ్లపైకి నీరు చేరడంతో నగరంలో కొన్ని చోట్ల రవాణా మొత్తం స్తంభించిపోయింది. అటువంటి సమయంలో ఓ గర్భిణీకి అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఈ నెల 14న రాత్రి 10 గంటలకు ఒక గర్భవతి కొత్తపేట్‌లోని విక్టోరియా మెమోరియల్ స్టేషన్ చేరుకున్నారు. సాధారణంగా ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ వేరే మార్గం లేదని వచ్చిన ఆమె కోసం ప్రత్యేకంగా స్పెషల్ సర్వీస్‌ నడిపి గమ్యస్థానానికి చేర్చారు. రాత్రి 10 గంటల తర్వాత సర్వీసులు లేకపోయినప్పటికీ.. ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో రైలును నడిపేందుకు సిద్ధంగా ఉండాలని అప్పటికే అన్ని స్టేషన్లకు ఆదేశాలు అందాయి. విక్టోరియా మెమోరియల్ స్టేషన్ కి వచ్చి ఎలాగైనా మియాపూర్ వెళ్లాలని కోరిన ఆ మహిళను ఒక ప్రత్యేక సర్వీస్ ను నడిపి మియాపూర్‌కు చేర్చినట్లు మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.