హైదరాబాద్‌లో… బ్రాండ్‌ బాబులు!

Hyderabad city people craze about branded high-end cars and bikes, హైదరాబాద్‌లో… బ్రాండ్‌ బాబులు!

కొత్త బ్రాండు, హైఎండు..కార్లు… బైకులు… నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్‌ కారు వచ్చినా.. బైక్‌ వచ్చినా బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్‌ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చింది.

హై ఎండ్‌ కార్లు, బైక్‌ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్‌ బెంజ్‌కు చెందిన జీఎల్‌ఎస్‌ 350డీ 4 మాటిక్‌ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్‌ 5 ఎక్స్‌డ్రైవ్‌ 30డీ డీపీఈ విత్‌ ఎట్‌ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్‌ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ 69, వోల్వో ఎక్స్‌ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్‌ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి.

హైఎండ్‌ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్‌సన్‌ దూసుకుపోతోంది. హార్లీడేవిడ్‌సన్‌ ఎక్స్‌జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్‌సన్‌ ఎక్స్‌జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్‌కే మోటార్‌ వీల్స్‌ టీఎన్‌ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్‌ (జపాన్‌), ఇండియా కవాసకి మోటార్స్‌కు చెందిన నింజా 650 తదితర బైక్‌ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్‌ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్‌ బైక్‌లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్‌ డీలర్లు అభిప్రాయపడ్డారు. కాగా, 2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌ –6 మోడల్‌ మార్కెట్‌లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *