ఇది చేతి గాజే అనుకున్నారో..ఆకతాయిల బాజా మోగినట్టే!

selfe security Bangle for women

రోడ్డుమీద ఒంటరి యువతులు, మహిళలుకు బొత్తిగా రక్షణ లేకుండాపోయింది. వెనుకనుంచి ఏ బైక్ మీద ఎవడొస్తాడో.. ఎప్పుడు మెడలో గొలుసు లాక్కుపోతాడో అని భయపడాల్సిన పరిస్థితులున్నాయి. ఇప్పటికే మహిళల రక్షణ కోసం పోలీసులు ఎన్నో చర్యలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం అంతకుమించిన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.
పోలీసులు, షీ టీమ్‌లు ఎన్ని ఉన్నా.. మహిళలు స్వతహాగా ఎవరికి వారు రక్షణ ఏర్పాట్లు చేసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే పెప్పర్ స్ప్రే వంటివి అందుబాటులోకి వచ్చినా.. పెద్దగా ఎవరూ ఉపయోగించని పరిస్థితి. దీనికి కారణాలేమైనా కావచ్చు అయితే వ్యక్తిగత భద్రతను మాత్రం ఎవరికి వారు తీసుకోవాల్సిందే.

మహిళలపై పెరిగిపోతున్న దాడులనుంచి తప్పించుకోడానికి హైదరాబాద్‌కు చెందిన ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి స్మార్ట్ గాజును రూపొందించాడు. ఇది ధరించిన మహిళ.. తనపై ఎవరైనా చేయి వేస్తే వారికి వెంటనే షాక్ కొడుతుంది. దీన్ని ఇలా తయారు చేసారు. హైదరాబాద్‌కు చెందిన హరీశ్,అతడి స్నేహితుడు సాయితేజ కలిసి ఈ స్మార్ట్ బ్యాంగిల్‌ను తయారు చేశారు. చిన్న పిల్లలనుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా సరే దీన్ని ధరిస్తే దుర్మార్గుల ఘాతుకాలనుంచి రక్షించుకునే వీలు కలుగుతుందని వీరు చెబుతున్నారు. ఇందులో మరో విచిత్రమేమిటంటే ఎవరైనా ఈ గాజును ధరించిన తర్వాత ఏదైనా ఆపదలో చిక్కుకుంటే వెంటనే ఆ సమాచారాన్ని దగ్గర్లోని పోలీసులకు చేరవేస్తుంది కూడా. దీనివల్ల బాధితురాలికి రక్షణ కూడా దొరుకుతుందని వీరు చెబుతున్నారు.

ఏది ఏమైనా వ్యక్తిగత భద్రత విషయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. స్త్రీలకు రక్షణ కల్పిస్తుందని చెబుతున్న ఈ స్మార్ట్ బ్రాస్‌లెట్ లేక గాజు.. ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *