అనుమానం ఓ మహిళ ప్రాణాలు తీసింది. కట్టుకున్న భార్య ఎవరితోనో మాట్లాడుతుందనే అనుమానం కలిగింది. ఆ అనుమానం పెనుభూతంగా మారింది. అంతే.. భార్యను నిర్దాక్ష్యన్యంగా హతమార్చాడు. ఈ సంఘటన కడప జిల్లాలో లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కడపజిల్లాలోని కాశినాయన మండలం చిన్నాయపల్లెకి చెందిన అయ్యలూరు పుల్లారెడ్డి (55), నారాయణమ్మ (50) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. దంపతుల మధ్య కొన్నేళ్లుగా కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి పుల్లారెడ్డి నారాయణమ్మల ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆవేశంలో భర్త పుల్లారెడ్డి భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని గోనె సంచిలో కుక్కి పొలం పక్కన ఉన్న తెలుగుగంగ కాలువలో పడేశాడు.
ఇదిలావుండగా, బుధవారం రాత్రి బి.కోడూరు పోలీస్స్టేషన్లో పుల్లారెడ్డి లొంగిపోయాడు. అతను ఇచ్చిన సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని గుర్తించారు. భర్త వేధింపులు తట్టుకోలేక నారాయణమ్మ బి.మఠం మండలం బొగ్గులవారిపల్లెలోని తన పుట్టింటికి వెళ్లిపోయిందని, ఇటీవల కుమారుడు ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. తన తల్లిని తండ్రే హత్య చేశాడని కుమారుడు వీరమోహన్రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.