Breaking News
  • నేడు సీఎం జగన్‌ ఇంటి ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు. కర్నూలులో రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌.
  • నేటి నుంచి భారత్‌, బంగ్లాదేశ్‌ చరిత్రాత్మక డేఅండ్‌ నైట్‌ టెస్టు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మ్యాచ్‌ ప్రారంభం.
  • హైదరాబాద్‌: ఈఎస్‌ఐ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత. ఐఎంఎస్‌లో ఫిబ్రవరి నుంచి నిలిచిపోయిన కొనుగోళ్లు. ఐఎంఎస్‌ కుంభకోణం నేపథ్యంలో.. ఔషధాల కొనుగోళ్లకు ముందుకురాని అధికారులు. ఔషధాల కొనుగోలు బాధ్యతను.. క్షేత్రస్థాయి అధికారులకు అప్పగించాలనే యోచనలో ఐఎంఎస్‌.
  • హైదరాబాద్‌లో అమిటీ యూనివర్సిటీ. విద్యాశాఖకు దరఖాస్తు చేసిన అమిటీ గ్రూపు. ఇప్పటికే దేశంలోని 10 నగరాల్లో ఉన్న అమిటీ యూనివర్సిటీలు.
  • రజినీకాంత్‌ వ్యాఖ్యలకు పళనిస్వామి కౌంటర్‌. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయకుండా.. రాజకీయాల్లో అద్భుతాలపై మాట్లాడడం సరికాదు. దేని ఆధారంగా 2021 ఎన్నికల్లో అద్భుతం జరుగుతుందని.. రజినీకాంత్‌ విశ్వసిస్తున్నారో అర్థం కావడంలేదు-పళనిస్వామి.
  • గంగానది ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ప్రక్షాళన కోసం రూ.28,600 కోట్ల వ్యయంతో.. 305 ప్రాజెక్టులను మంజూరు చేశాం. దాదాపు 109 ప్రాజెక్టులను పూర్తయ్యాయి. ప్రస్తుతం గంగా నదిలో నీటి నాణ్యత పెరిగింది -కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌.
  • 2020లో సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. 23 సాధారణ సెలవులు, 17 ఐచ్ఛిక సెలవులు ఇవ్వాలని నిర్ణయం.
  • గుంటూరు: 104 సిబ్బంది మధ్య ఘర్షణ. రాడ్‌తో ఫార్మసిస్ట్‌పై దాడి చేసిన డ్రైవర్‌. ఫార్మసిస్ట్‌ పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి దగ్గర ఘటన.

హౌడీ మోదీ: ట్రంప్ మోదీల కలయిక… ప్రవాస భారతీయులకు లాభమా?

అయిదేళ్ల క్రితం నరేంద్ర మోదీ భారత ప్రధాని హోదాలో తొలిసారి అమెరికాలో అడుగు పెట్టినప్పుడు.. న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద లభించిన ఘన స్వాగతం ఆయన విజయాన్ని ప్రతిబింబించింది. రెండోసారి కూడా ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన తరువాత ఇప్పుడు మళ్లీ మోదీ అమెరికాలో అంతకంటే పెద్దసంఖ్యలో అభిమానులనుద్దేశించి మాట్లాడబోతున్నారు. సెప్టెంబర్ 22 న ఆదివారం హ్యూస్టన్‌లో నిర్వహించే ఈవెంట్‌లో మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటున్నారు.

ఇటీవల కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయం… ఈ క్రమంలో అంతర్జాతీయంగా వచ్చిన విమర్శల  నుంచి ఇది ఆయన్ను విముక్తుడిని చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. ‘హౌడీ మోదీ’ పేరిట నిర్వహిస్తున్న ఈ ఈవెంట్‌కు 50 వేల మంది హాజరవుతారని అంచనా. భారతదేశం వెలుపల మోదీ మద్దతుదారులు ఇంత పెద్దసంఖ్యలో పోగవడం ఇదే తొలిసారి. ట్రంప్‌తో కలిసి ఇలా అమెరికాలో సభ నిర్వహించడమనేది అంతర్జాతీయ ప్రజాసంబంధాల వ్యవహారంలో మోదీ సాధించిన విజయమనే చెప్పాలి. అమెరికా, భారత్ మధ్య సంబంధాలకు పెరుగుతున్న ప్రాముఖ్యతకు ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.

‘ఇది అమెరికాలో భారతీయ అమెరికన్ సమాజ బలిమిని ప్రతిబింబిస్తోంది’ అని ఒబామా అడ్మినిస్ట్రేషన్‌లో విదేశీ వ్యవహారాలలో భారత్, దక్షిణాసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన నిషా బిస్వాల్ తెలిపారు. ట్రంప్ ఈ సభకు హాజరవడం గొప్ప పరిణామమని ఆమె స్పష్టం  చేశారు. మోదీ, ట్రంప్ మధ్య బంధం ఇప్పుడు వ్యక్తిగత, రాజకీయాల స్థాయి దాటి ముందుకెళ్లిందని నిషా వివరించారు.

‘హౌడీ మోదీ’ ఈవెంట్ నిర్వాహకులు డెమొక్రటిక్ పార్టీ ప్రముఖులు స్టెనీ హోయర్ వంటివారు, పలువురు ఇతర కాంగ్రెస్ నేతలు, వివిధ రాష్ట్రాల గవర్నర్లను కూడా పిలిచి ఇది ఇరుదేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక వ్యవహారంలా మార్చే ప్రయత్నం చేశారు. ఇందుకు హ్యూస్టన్‌ను వేదికగా ఎంచుకోవడంలోనూ ఆశ్చర్యం లేదు. భారత్‌తో వాణిజ్య భాగస్వామ్యం ఉన్న నాలుగో అతిపెద్ద నగరం హ్యూస్టన్. అమెరికాతో ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడానికి భారత్‌కు ఇదో అవకాశం కూడా. మరోవైపు గత ఏడాదిన్నర కాలంలో భారత్, అమెరికాల మధ్య తలెత్తిన వాణిజ్య విభేదాలను రూపుమాపుకొనేందుకూ ఈ సభ సహకరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే మోదీ అది తాను సాధించిన విజయంగా భావిస్తారు. ఇక ట్రంప్ వైపు నుంచి చూస్తే రానున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు అనుకూలంగా అమెరికాలోని భారతీయులు వ్యవహరించేలా ఈ సభ సహకరిస్తుంది . అమెరికాలో భారతీయుల జనాభా 32 లక్షలు.. ఆ దేశ జనాభాలో ఒక శాతం.

అమెరికాలోని భారతీయుల్లో అత్యధికులు డెమొక్రటిక్ పార్టీ సానుభూతిపరులు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో అత్యధికులు హిల్లరీ క్లింటన్‌కు ఓటేశారని ‘ఆసియన్ అమెరికన్ లీగల్ డిఫెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫండ్’  అనే సంస్థ తెలిపింది. మోదీ జాతీయవాద దృక్పథం, భారతదేశాన్ని ప్రపంచదేశాల మధ్య సగర్వంగా నిలపుతానంటూ ఆయన చేసే ప్రతిజ్ఞల కారణంగా అమెరికాలోని భారతీయుల్లో ఆయనకు విశేషాదరణ లభిస్తోంది. ఈ సభ తరువాత అమెరికాలోని మోదీ అభిమానుల్లో చాలామంది డెమొక్రాట్ల నుంచి తమ వైపు మళ్లుతారని రిపబ్లికన్లు ఆశిస్తున్నారు.

మోదీ అమెరికా టూర్‌లో చాలా ప్రత్యేకతలున్నాయి. ముఖ్యంగా ట్రంప్‌తో మోదీ ఈ ఏడాది మూడోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకుముందు జపాన్‌లో జరిగిన జీ20 సదస్సులో, ఆ తర్వాత ఆగస్ట్‌లో ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో వాళ్లిద్దరూ కలిశారు. నేడు జరిగే హౌడీ-మోదీ ఎన్నారైల సదస్సులో ట్రంప్… ప్రవాస భారతీయులను ఉద్దేశించి… కొన్ని కీలక ప్రకటనలు చేయబోతున్నారని తెలిసింది. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లను కొల్లగొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నిస్తున్న ట్రంప్… ఈ సదస్సును అందుకు వేదికగా చేసుకోబోతున్నారు.

కాగా… హ్యూస్టన్ సభ అనంతరం ప్రధాని మోదీ గేట్స్ ఫౌండేషన్ నుంచి స్వచ్ఛతా అవార్డు అందుకోబోతున్నారు. అయితే, కశ్మీర్ విషయంలో మోదీ తీరును నిరసిస్తూ కొందరు ఈ అవార్డును మోదీకి ఇవ్వరాదంటూ గేట్స్ ఫౌండేషన్‌కు లక్ష సంతకాలతో ఫిర్యాదు చేశారు. అయితే, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ దీనిపై స్పందిస్తూ ‘భారత దేశంలో పారిశుద్ధ్యానికి సంబంధించిన విజయాలకు గాను ఈ అవార్డు ఇస్తున్నాం. మా నిర్ణయం సరైనదే’నని స్పష్టం చేశారు.