నిరసనల హోరు.. బిల్లుకు స్వస్తి.. చల్లారిన హాంకాంగ్ అగ్గి !

వివాదాస్పదమైన నేరస్తుల అప్పగింత బిల్లుపై హాంకాంగ్ లో వెల్లువెత్తిన ప్రజాగ్రహానికి, నిరసనల హోరుకు ప్రభుత్వం దిగివచ్చింది. ఈ బిల్లును ప్రస్తుతానికి సస్పెండ్ చేయాలని (నిలుపుదల చేయాలని) నిర్ణయించినట్టు చైనా అనుకూల నాయకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్యారీ లామ్ ప్రకటించారు. ఈ బిల్లును చట్టంగా అమలు చేయరాదంటూ వారం రోజులుగా హాంకాంగ్ నగరంలో లక్షలాది ప్రజలు భారీఎత్తున నిరసన ర్యాలీలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఆందోళనకారుల ప్రదర్శనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ బిల్లుకు స్వస్తి చెబుతున్నట్టు క్యారీ లామ్ పేర్కొన్నారు.

తన సొంత రాజకీయ మిత్ర పక్షాలు, అడ్వైజర్ల నుంచే వ్యతిరేకతను ఆమె ఎదుర్కోవలసివచ్చింది. దీన్ని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, చట్టం చేసే ముందు మొదట అన్ని వర్గాలతోను, పార్లమెంట్ పానెల్ తోను చర్చిస్తామని ఆమె చెప్పారు. కానీ డెడ్ లైన్ ఏదీ లేదని, నిరసనకారుల ఆందోళనతో కొంతవరకు ప్రభుత్వం దిగివచ్చిన మాట నిజమేనని ఆమె అన్నారు. శుక్రవారం రాత్రి ఆమె తన సలహాదారులతోనూ, అనంతరం చైనా అధికారులతోను భేటీ అయి.. తాజా పరిణామాలపై చర్చించారు. కాగా-తాము మాత్రం నిరసన కొనసాగిస్తామని ప్రదర్శనకారులకు నేతృత్వం వహిస్తున్న సివిల్ హ్యూమన్ రైట్స్ ఫ్రంట్ ప్రకటించింది. ప్రభుత్వం ఈ బిల్లును సస్పెండ్ చేసినప్పటికీ, అది చాలదని, దీన్ని పూర్తిగా ఉపసంహరించాలని తాము కోరుతున్నామని ఈ సంస్థ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *