కరోనా టెస్టులపై హైకోర్టు కీలక కామెంట్

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై హైదరాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలుకాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది.

కరోనా టెస్టులపై హైకోర్టు కీలక కామెంట్
Follow us

|

Updated on: Jun 08, 2020 | 4:43 PM

తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై హైదరాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ ఆదేశాలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆదేశాలు అమలుకాకపోతే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ పరిణామాలు సోమవారం చోటుచేసుకున్నాయి. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌లను బాధ్యుల్ని చేస్తామని హైకోర్టు కుండ బద్దలు కొట్టింది.

ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. విచారణ జరగాల్సి ఉందని ఏజీ వివరిణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. సుప్రీంకోర్టులో విచారణ జరిగే వరకు హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న ధర్మాసనం ఏజీకి స్పష్టం చేసింది.

ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులకు కరోనా వైరస్ సోకిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీడియా బులెటిన్లలో తప్పుడు లెక్కలు ఇస్తే కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరిక జారీ చేసింది. వాస్తవాలు తెలియకుంటే ప్రజలకు కరోనా తీవ్రత ఎలా తెలుస్తుందని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

జూన్ 17వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని వైద్యారోగ్య శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల గణాంకాలు పత్రికలు, వెబ్ సైట్ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్దేశించింది. కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోందన్న అవగాహన ప్రజల్లో కల్పించాలని హైకోర్టు పేర్కొంది. కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకునేలా ప్రజల్లో చైతన్యం పెంచాలని ఆదేశించింది.