విశాఖమన్యంలో హై అలర్ట్, మావో సానుభూతిపరులపై పోలీస్ నజర్.. పలువురు అదుపులోకి, మరికొందరు లొంగుబాటు

విశాఖమన్యంలో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందన్న అనుమానంతో మావోయిస్టు సానుభూతిపరులపై కన్నేశారు పోలీసులు...

విశాఖమన్యంలో హై అలర్ట్, మావో సానుభూతిపరులపై పోలీస్ నజర్.. పలువురు అదుపులోకి, మరికొందరు లొంగుబాటు
Follow us

|

Updated on: Nov 29, 2020 | 9:00 PM

విశాఖమన్యంలో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుందన్న అనుమానంతో మావోయిస్టు సానుభూతిపరులపై కన్నేశారు పోలీసులు. తాజాగా మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే కొందర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారినుంచి విలువైన సమాచారాన్ని సేకరించారు. ముంచంగిపుట్టు మండలం కుమడ దగ్గర నాగన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి విప్లవ సాహిత్యం, మెడికల్‌ మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఉపా చట్టం కేసులు నమోదు చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో 53మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. వీరిలో మావోయిస్టు అగ్రనేతలు ఆర్కే, రవి, అరుణతోపాటు.. పలువురు పౌరహక్కుల సంఘాల నాయకులు, సానుభూతి పరులున్నారు. 2018 కేసులో జీ మాడుగుల పోలీసులు ఉపా చట్టం కింద ఇద్దరు మహిళలను అరెస్ట్‌ చేశారు. వీరిలో ఒకరు అమరవీరుల బంధుమిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, మరొకరు చైతన్య మహిళా సంఘం రాజేశ్వరి ఉన్నారు. వీరిని గుంటూరులో అరెస్ట్‌ చేసి.. విశాఖ తీసుకొచ్చారు.

మరోవైపు విశాఖ ఏజెన్సీలో మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కొయ్యూరు మండలం, బూదరాళ్ల పంచాయతీ పరిధిలో 13 మంది మిలీషియా సభ్యులు లొంగిపోయారు. వీళ్లంతా మంప పోలీసుల సమక్షంలో ఈరోజు ఉదయం స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇటీవల కాలంలో హరి అనే మావోయిస్టును అరెస్టు చేశారు పోలీసులు. హరికి సన్నిహితులుగా ఉంటూ.. ఆయన చేపట్టే మావోయిస్టు కార్యకలాపాల్లో ఈ 13మంది చురుగ్గా పొల్గొనేవారు. హరిని అరెస్టు చేయడంతో వీరంతా ఇక మావోయిస్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుని లొంగిపోయినట్టు పోలీసులు తెలిపారు. వీరు ఆర్థికంగా అభివృద్ధి సాధించేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. వీరు జనస్రవంతిలో కలిసి తిరిగేందుకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు పోలీసులు.