ముంచెత్తుతున్న వాన.. రెండు తెలుగురాష్ట్రాల విలవిల

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం సుమారు 8 గంటలనుంచి శుక్రవారం ఉదయం దాదాపు ఎనిమిది గంటలవరకు కురిసిన కుంభవృష్టితో ఈ రాష్టాల్లో జనజీవనం అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాల కారణంగా తీవ్రంగా పంటల నష్టం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరితో బాటు శబరి నది కూడా పోటెత్తుతోంది. రాజమండ్రి […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 11:30 am, Sat, 3 August 19

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం సుమారు 8 గంటలనుంచి శుక్రవారం ఉదయం దాదాపు ఎనిమిది గంటలవరకు కురిసిన కుంభవృష్టితో ఈ రాష్టాల్లో జనజీవనం అతలాకుతలమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా.. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాల కారణంగా తీవ్రంగా పంటల నష్టం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో గోదావరితో బాటు శబరి నది కూడా పోటెత్తుతోంది. రాజమండ్రి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం 10. 6 అడుగులకు పెరిగింది. అలాగే పోలవరం వద్ద గోదావరి ఉధృతి 12. 38 మీటర్లకు చేరుకుంది. ప్రాజెక్టు స్పిల్ వే లోకి భారీగా నీరు చేరడంతో ప్రాజెక్టు పనులకు అంతరాయం కలిగింది. మొత్తం 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ధవళేశ్వరం వద్ద నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో.. 8. 53 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణమ్మ పరవళ్లతో జూరాలకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 2. 47 లక్షలు కాగా… అవుట్ ఫ్లో 2. 19 లక్షల క్యూసెక్కులని అధికారులు తెలిపారు. ఆల్మట్టి వద్ద కృష్ణ ఉగ్రరూపం దాల్చింది. దీంతో 2. 30 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు లోకి వరద ఉధృతి పెరగడంతో రెండు లక్షల క్యూసెక్కులకు చేరింది. కాళేశ్వరం పుష్కర ఘాట్ల వద్ద గోదావరి 38 అడుగులకు చేరింది. మేడారం జంపన్న వాగు వద్ద కూడా నీటి మట్టం పెరిగింది.

ఇక తెలంగాణ కూడా ఇందుకు అతీతంగా లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఏటూరు నాగారం, వరంగల్ గ్రామీణ జిల్లా, శాయంపేట, తదితర జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. త్రివేణీ సంగమం కాళేశ్వరం వద్ద నీటి ఉధృతి పెరగడంతో మేడిగడ్డ బ్యారేజీ 65 గేట్లు ఎత్తి, 4. 67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అన్నారం బ్యారేజీ మూడు గేట్లను ఎత్తివేశారు. హైదరాబాద్ నగరంలో శుక్రవారమంతా ముసురు పట్టి చిరుజల్లులు కురిశాయి. శనివారం కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. అటు-ఆదివారం కూడా రెండు తెలుగు రాష్టాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.