మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

Monsoon 2019, మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలు ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కాలుతీసి బయటపెట్టలేని స్థితిలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వానలు ఇంకా పెరిగి మరోరెండు రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. విశాఖ ఏజెన్సీ, ఆంధ్రా ఒరిస్సా సరిహద్దులో కురుస్తున్న వర్షాలతో అరకులోయ,సీలేరు, డుంబ్రిగుడ మండలాల్లో వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. డొంకరాయి జలాశయం నీటితో నిండిపోయి ప్రమాదకరస్థాయికి చేరుకుంది. తూర్పుగోదావరి జిల్లా చింతూరులో అత్యధికంగా 17 సెం.మీ వర్షపాతం నమోదైంది. వరరామచంద్రాపురం, కూనవరంలో 13 సెంటీమీర్ల వర్షపాతం నమోదైంది.

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరకోస్తాంధ్రలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 5.8 నుంచి 7.6 కిమీ మధ్యలో ఆవరించి ఉంది. దీనితో పాటు ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని, ఇది మరింత తీవ్రంగా మారే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 5, 6 తేదీల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావం బంగాళాఖాతంలో తీవ్రంగా ఉంటుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని నాలుగు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు.

మరోవైపు ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ తడిసి ముద్దవుతున్న పరిస్థితి . అలాగే గోదావరి నదిలో జలకళ సంతరించుకుంది. కాళేశ్వరం, పేరూరు, దుమ్ముగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో రెండ్రోజులుగా కంటిన్యూగా వాన కురుస్తూనే ఉంది. రోడ్లమీద ఎక్కడిక్కడే ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. వర్షాల కారణంగా అపార్ట్‌మెంట్ సెల్లార్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరోవైపు ఎక్కడైన సమస్య ఉన్నట్టయితే వెంటనే చర్యలు తీసుకునేందు రెస్క్యూటీమ్‌ను జీహెచ్ఎంసీ రెడీగా ఉంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *