Breaking News: దూసుకొస్తున్న నివర్ తుఫాన్.. ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

 • Rajesh Sharma
 • Publish Date - 8:16 pm, Wed, 25 November 20
Breaking News: దూసుకొస్తున్న నివర్ తుఫాన్.. ఉత్తర తమిళనాడు, దక్షిణాంధ్రలో భారీ వర్షాలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్

నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కి.మీల దూరంలో.. పుదుచ్చేరికి 190 కి.మీల దూరంలో.. చెన్నైకి 190 కి.మీల దూరంలో కేంద్రీ కృతమైంది. మరికొన్ని గంటల్లో నివర్ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా రూపు దాల్చనుంది. ఈ అర్ధరాత్రి లేదా నవంబర్ 26 ఉదయం వేళల్లో కరైకల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.

నివర్ తుఫాను ప్రభావం చెన్నై తీరంపై మొదలైంది. మంగళవారం మధ్యాహ్నం నుంచి చెన్నై నగరాన్ని అతిభారీ వర్షం ముంచెత్తింది. నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. జన జీవనం కాస్తా.. జల జీవనంగా మారి పోయింది. రోడ్లన్నీ జలమయం కావడంతో ప్రజలు తమ వాహనాలను ఈడ్చుకుంటూ తీసుకెళ్ళాల్సి వస్తోంది.

మరోవైపు చెన్నైకి దక్షిణాన తీరం దాటుతుందని భావిస్తున్న నివర్ తుఫాను దక్షిణాంధ్ర ప్రాంతం పైన కూడా విపరీత ప్రభావం చూపనున్నది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుఫాను ప్రభావం వుంటుందని అంచనా వేస్తున్న జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి.. తగు సూచనలు చేశారు. ఆదేశాలిచ్చారు. తుఫాను నేరుగా ఏపీని తాకకపోయినా.. దాని ప్రభావం దక్షిణ ఆంధ్ర జిల్లాలతోపాటు రాయలసీమలోను చిత్తూరు, కడప జిల్లాలపై తీవ్రంగా వుందన్న వాతావరణ శాఖ నివేదికకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

నివర్‌ తుపాను నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘‘ తుఫాను నేరుగా ఏపీని తాకక పోయినా, సమీప ప్రాంతంలో దాని ప్రభావం ఉంటుంది.. భారీ వర్ష సూచనన ఉంది.. ఈ నేపథ్యంలో మనం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.. రేపు (నవంబర్ 25) సాయంత్రం నుంచి, ఎల్లుండి (నవంబర్ 26) వరకు తుఫాను ప్రభావం ఉంటుందని చెప్తున్నారు.. వర్షాలు బాగా పడే అవకాశాలున్నాయి.. దీనికి మనం సన్నద్ధంగా ఉండాలి.. ’’ అని ముఖ్యమంత్రి జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

నెల్లూరు, చిత్తూరు, కడపలోని కొన్ని ప్రాంతాలు, ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తాయని అంఛనా వేస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలలో కూడా 11 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ అంఛనా వేస్తోంది. 65 నుంచి 75 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం.

LIVE NEWS & UPDATES

 • 25 Nov 2020 19:51 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తెల్లవారుజామున 2 గంటలకు తీరం దాటే అవకాశం..

  తమిళనాడు రాష్ట్రంపై నివర్ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. ఈ రోజు సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 22,466 మంది చిన్నారులతో సహా 1.21 లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి ప్రభుత్వ సహాయ కేంద్రాలకు తరలించామని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.

 • 25 Nov 2020 19:51 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. తీవ్ర సైక్లోన్‌గా మారింది. చెన్నై అతలాకుతలం..

  రాత్రి 7 గంటల నాటికి, నివర్ తుఫాన్ తీవ్రమైన సైక్లోన్‌గా మారింది. అది కడలూరుకు 110 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంలో, పుదుచ్చేరికి 115 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయంలో.. చెన్నైకి 185 కిలోమీటర్ల ఆగ్నేయంలో కేంద్రీకృతమై ఉంది.

  రాత్రి 7 గంటలకు నాటికి పలు ప్రాంతాల్లో గాలి వేగం ఇలా ఉంది.. నాగపట్నం 35 కి.మీ,
  కరైకల్ -25 కి.మీ,
  కడలూరు -18 కి.మీ,
  పుదుచ్చేరి- 18 కి.మీ,
  చెన్నై -20 కి.మీ

 • 25 Nov 2020 19:37 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్.. వరద ప్రాంతాల్లో తమిళనాడు సీఎం పర్యటన.. ఎలాంటి ప్రమాదం లేదంటూ..

  నివర్ తుఫాన్ ప్రభావం చెన్నైపై భారీగా పడింది. దీనితో ఆ నగరానికి 2015 ఫీవర్ పట్టుకుంది. 2015లో చెన్నైని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే నివర్ తుఫాన్ కారణంగా చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై శివారులోని చంబరపాకం రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయమని అధికారులను తమిళనాడు సీఎం పళనిస్వామి ఆదేశించారు. వరద నీటిలో మునిగిన పలు ప్రాంతాల్లో కూడా స్వయంగా సీఎం పళని స్వామి పర్యటించి అక్కడి ప్రజలను కలిశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అన్ని విధాలా సహాయక చర్యలు చేపడుతున్నామని భరోసా ఇచ్చారు. ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు.

 • 25 Nov 2020 18:24 PM (IST)

  నివర్ తుఫాన్.. రేపటి ఉదయం 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయం మూసివేత..

  నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తోంది. దీని ప్రభావం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఈ అర్ధరాత్రి నివర్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాత్రి 7 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసి వేయనున్నారు. ఎలాంటి విమాన సర్వీసులు ఉండవని స్పష్టం చేశారు.

 • 25 Nov 2020 17:38 PM (IST)

  నివర్ తుఫాన్.. ఏపీ మంత్రి సమీక్షా సమావేశం.. ముమ్మరంగా సహాయక చర్యలు..

  నివర్ తుఫాన్‌పై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో సమీక్షా సమావేశం నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయో కలెక్టర్, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 700 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ఈ రోజు, రేపు ప్రజలు తమతో సహకరించాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

   

 • 25 Nov 2020 17:30 PM (IST)

  నివర్ తుఫాన్.. అర్ధరాత్రి కరైకల్-మహాబలిపురం మధ్య తీరం దాటే సూచనలు..

  నైరుతి బంగాళాఖాతంలో నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. ప్రస్తుతం కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కి.మీల దూరంలో.. పుదుచ్చేరికి 190 కి.మీల దూరంలో.. చెన్నైకి 190 కి.మీల దూరంలో కేంద్రీ కృతమైంది. మరికొన్ని గంటల్లో నివర్ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా రూపు దాల్చనుంది. ఈ అర్ధరాత్రి లేదా నవంబర్ 26 ఉదయం వేళల్లో కరైకల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఆ సమయంలో 120 నుంచి 140 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

 • 25 Nov 2020 17:30 PM (IST)

  నివర్ తుఫాన్.. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు..

  బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ అరణంగా నెల్లూరు, కడప చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు కారణంగా పలు చోట్ల చెట్లు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పోలీసు బలగాలు మొహరించాయి. తీర ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు చేరుస్తున్నారు. ప్రస్తుతం నివర్ తుఫాన్ కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 180 కి.మీల దూరంలో.. పుదుచ్చేరికి 190 కి.మీల దూరంలో.. చెన్నైకి 190 కి.మీల దూరంలో కేంద్రీ కృతమైంది.

 • 25 Nov 2020 16:19 PM (IST)

  నివర్ తుఫాన్.. తమిళనాడు, పుదుచ్చేరిలలో సుమారు 37,000 మందిని తరలించిన సహాయక బృందాలు..

  నివర్ తుఫాన్ చాలా తీవ్రంగా మారింది. నేటి సాయంత్రం తీరం దాటే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతోంది. గత రెండు రోజులుగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో 25 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మొహరించబడ్డాయి.

  ఇప్పటికే తమిళనాడులో సుమారు 30,000 మందికి పైగా ప్రజలను.. పుదుచ్చేరిలో 7,000 మందిని తీర ప్రాంతాల నుంచి తరలించారు. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు సమిష్టిగా పని చేస్తూ నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని జాతీయ విపత్తు శాఖ డీజీ ఎస్ఎన్ ప్రధాన్ తెలిపారు.

 • 25 Nov 2020 15:55 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్ : దక్షిణాంధ్ర, రాయలసీమలలోని పలు చోట్ల వర్షాలు..

  నివర్ తుఫాన్ తీవ్రమైన సైక్లోన్‌గా మారింది. దీని ప్రభావం కారణంగా దక్షిణాంధ్ర తీర ప్రాంతాలతో పాటు రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

 • 25 Nov 2020 15:51 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్ : తమిళనాడులోని 13 జిల్లాల్లో గురువారం సెలవు.. ఏడు రైళ్లు రద్దు..

  నివర్ తుఫాన్ ప్రభావం కారణంగా తమిళనాడులో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చెన్నైలో భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యంలో తమిళనాడు సీఎం పళనిస్వామి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గురువారం సెలవుగా ప్రకటించారు. అలాగే దక్షిణ మధ్య రైల్వే గురువారం చెన్నై నుంచి వెళ్లే ఏడు ట్రైన్స్‌ను రద్దు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

 • 25 Nov 2020 15:43 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్ : రెండు స్పైస్‌జెట్‌ విమానాలు రద్దు..

  నివర్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చిన కారణంగా స్పైస్‌జెట్‌ ఈరోజు బెంగళూరు-చెన్నై మధ్య నడిచే రెండు విమానాలను రద్దు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

  SG3309 చెన్నై- బెంగళూరు: సాయంత్రం 5.35 గంటలకు..

  SG 3026 బెంగళూరు-చెన్నై: రాత్రి 9.45 గంటలకు

   

 • 25 Nov 2020 15:43 PM (IST)

  నివర్ తుఫాన్: తమిళనాడులో మోహరించబడిన 14 ఇండియన్ ఆర్మీ రెస్క్యూ టీమ్స్..

  నివర్ తుఫాన్ కారణంగా తమిళనాడు అతలాకుతలం అవుతోంది. నేడు సాయంత్రం తుఫాన్ కరైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ సమయంలో బలమైన గాలులు వీస్తాయని.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపధ్యంలో భారత సైన్యం తమిళనాడుకు 14 రెస్క్యూ టీమ్స్‌ను పంపించింది. పది మంది సభ్యులతో పాటు రెండు రెస్క్యూ బోట్లు కలిగిన ఈ టీమ్స్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొహరించాయి.

 • 25 Nov 2020 15:29 PM (IST)

  నివర్ తుఫాన్: చిత్తూరులో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవులు..

  నివర్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ సాయంత్రం కరైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గాలుల ఉద్ధృతి గంటకు 120-145 కి.మీ.ల మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే చిత్తూరు జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ముందుస్తు జాగ్రత్తగా చిత్తూరు జిల్లా కలెక్టర్ ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు.

 • 25 Nov 2020 15:27 PM (IST)

  గంటకు 145 కి.మీ వేగంతో గాలులు, అతి భారీ వర్షాలు, వచ్చే 6 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారనున్న నివర్

  వచ్చే 6 గంటల్లో నివర్ తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ తుఫాను నైరుతి

  వచ్చే 6 గంటల్లో నివర్ తీవ్ర తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఈ తుఫాను నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి తీవ్ర తుఫాన్ గా మారుతోందని ఆయన వెల్లడించారు. కడలూరుకి తూర్పు ఆగ్నేయ దిశగా 240 కి.మీ, పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కి.మీ, చెన్నైకి దక్షిణ ఆగ్నేయ దిశగా 300 కి.మీ వద్ద ఇది ప్రస్తుతం కేంద్రీకృతమై ఉందని తెలిపారు.

  ఇది వాయవ్య దిశగా వెళ్లి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. 26 వ తేదీ తెల్లవారుజామున కరైకల్, మమల్లపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 120 నుండి130, అధికంగా 145 కీ.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఫలితంగా దక్షిణ కోస్తాంధ్రలో 20 సెంటీమీటర్లు అంతకన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు.

  దీనివల్ల రాయలసీమలో 20 సెంటీమీటర్ల వర్షపాతం అంతకన్నా ఎక్కువ నమోదయ్యే అవకాశం కలదన్నారు. దక్షిణ తెలంగాణా జిల్లాల్లో రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి చెప్పారు.

 • 25 Nov 2020 13:12 PM (IST)

  నివర్ ఎఫెక్ట్, చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేత

  నివర్‌ తుపాను చెన్నై వైపు ప్రమాదకరంగా అడుగులు వేస్తోంది. దీని  ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాలతో పాటు  రాజధాని చెన్నైలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో నగరంలో జనజీవనం స్తంభించింది.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. తుపాను కారణంగా ముందు జాగ్రత్తగా చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిపివేశారు. 26 విమానాలను క్యాన్సిల్ చేసినట్లు వినామానాశ్రయ వర్గాలు తెలిపాయి. వర్షం వల్ల చెన్నైలోని చెంబరాంబక్కం సరస్సులో నీటి ఉధృతి పెరిగింది. దీంతో డ్యామ్‌ నుంచి నీటిని దిగువకు రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

 • 25 Nov 2020 11:12 AM (IST)

  నివర్‌ ప్రభావం‌: తిరుమలలో ఈదురుగాలులతో భారీ వర్షం

  నివర్ తుఫాన్ ప్రభావంతో ఈ రోజు ఉదయం నుంచి  తిరుమలలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. తుపాను కారణంగా భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో టీటీడీ యంత్రాంగం అలర్టై..భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుంది. అయినప్పటికీ  వెంకన్నను  దర్శించుకున్న భక్తులు  గుడి నుంచి గదులకు చేరుకునే సమయంలో వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ చరియలు పడే ప్రాంతంలో తీసుకోవాల్సిన చర్యలపై ఇంజినీరింగ్‌ విభాగం అప్రమత్తమైంది.

 • 25 Nov 2020 10:43 AM (IST)

  గంటకు 6 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా కదులుతున్న నివర్

  పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో నివర్ తుఫాన్‌ కేంద్రీకృతమైందని ఐఎండీ తెలిపింది. కొద్ది గంటల్లో అది పెను తుఫానుగా మారి రాత్రికి మామళ్లపురం- కరైకల్ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులో 12 సెం.మీ. మేర వర్షం పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షం పడుతోంది. పరిస్థితులను ఎదుర్కునేందుకు ఎన్డీఆర్ బృందాలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.

 • 25 Nov 2020 08:58 AM (IST)

  నివర్ ఎఫెక్ట్, ప్రకాశం జిల్లాలో అధికారులు అప్రమత్తం

  తమిళనాడు తీరం వైపు నివర్ తుపాను ప్రమాదకరంగా దూసుకొస్తోంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పుదుచ్చేరికి 310 కిలోమీటర్ల దూరంలో నివర్‌ ఉన్నట్లు ఐఎండీ వివరించింది. తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలోని పలు జిల్లాలపై అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో అధికారులు అలెర్టయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో 30 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. తీర ప్రాంత మండలాల్లో 11 మంది ఆఫీసర్స్‌ను కలెక్టర్ నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

 • 25 Nov 2020 07:45 AM (IST)

  నివర్ ఎఫెక్ట్, నెల్లూరు జిల్లాలో హైఅలర్ట్

  నివర్‌ తుఫాన్‌ ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో పలు చోట్ల వర్షాలు మొదలయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి. అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుంది. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. ప్రకృతి విపత్తును ఎదుర్కొనేందుకు  అందరూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశాలిచ్చారు. తీర ప్రాంతాల్లో పర్యటిస్తూ కలెక్టర్ చక్రధర్‌బాబు‌ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. డీఈఓసీలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూము ఏర్పాటయింది. రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు.

 • 25 Nov 2020 07:32 AM (IST)

  అతి తీవ్ర తుపానుగా ‘నివర్’.. నేడు తీరం దాటే అవకాశం

  నివర్​ అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా ప్రమాదకరంగా దూసుకువస్తోంది. సముద్రంలో అనువైన ఉష్ణోగ్రతలు , గాలిలో తేమ అందుబాటులో ఉండటం వల్ల అంతకంతకూ బలపడుతూ తీరం వైపుగా వస్తోందని వాతావరణ  శాఖ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం కరైకల్, మామళ్లపురం(మహాబలిపురం) మధ్య తీరాన్ని అవకాశం ఉందని, ఆ సమయంలో గాలుల ఉద్ధృతి గంటకు 120-145 కి.మీ. ల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు నివర్ ఎ‌ఫెక్ట్‌తో తమిళనాడులో ఇప్పటికే అనేక జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎమర్జెన్సీ విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు.

 • 24 Nov 2020 17:28 PM (IST)

  నివర్ తుఫాన్ బీభత్సం.. తమిళనాడును ముంచెత్తనున్న భారీ వర్షాలు.. భయాందోళనలో ప్రజలు..

  నివర్ తుఫాన్ ప్రభావం వల్ల నవంబర్ 25న తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతాయని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా తీర ప్రాంతాలు, ఉత్తర తమిళనాడు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే ఛాన్సులు ఉన్నాయంది. ఆయా ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మోహపాత్రా తెలిపారు.

 • 24 Nov 2020 17:18 PM (IST)

  ముంచుకొస్తున్న నివర్ తుఫాన్.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు..!

  నివర్ తుఫాన్ ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో సుమారు 400 కి.మీ దూరంలో చెన్నై, పుదుచ్చేరి తీరాల వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు సాయంత్రం కరైకల్, మహాబలిపురం మధ్య ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్నం తెలిపారు. దీని ప్రభావం కారణంగా రేపు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే ఎల్లుండి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు.

  మరోవైపు నివర్ తుఫాన్ ప్రభావం వల్ల రేపు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నెల్లూరు ,చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

 • 24 Nov 2020 17:09 PM (IST)

  నివర్ తుఫాన్ ఎఫెక్ట్: రేపు సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేసిన తమిళనాడు ప్రభుత్వం..

  తమిళనాడు: నివర్ తుఫాన్ ఎఫెక్ట్ తమిళనాడుపై భారీగా పడింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ నేపధ్యంలో పళనిస్వామి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. నివర్ తుఫాన్ దృష్ట్యా బుధవారం ఉదయం 10 గంటల నుంచి సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

 • 24 Nov 2020 17:03 PM (IST)

  నివర్ తుఫాన్ అలెర్ట్: ఏపీ, తమిళనాడు రాష్ట్రాల మధ్య రైళ్లు రద్దు..

  తీరం వెంబడి ముంచుకొస్తున్న నివర్ తుఫాన్ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొన్ని చోట్ల రెడ్ అలెర్ట్‌ను కూడా ప్రకటించాయి. ఈ క్రమంలోనే ఇండియన్ రైల్వేస్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది.

 • 24 Nov 2020 16:59 PM (IST)

  నివర్ తుఫాన్ రెడ్ అలెర్ట్ : ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరిలకు 30 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు..

  చెన్నైకి దక్షిణాదిన నివర్ తుఫాన్ నవంబర్ 25 సాయంత్రం తీరం దాటే అవకాశం ఉన్న నేపధ్యంలో 30 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రంగంలోకి దిగాయి. ఈ తుఫాన్ కారణంగా ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 9 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో మొహరించబడి ఉండగా.. మిగిలిన టీమ్స్ దక్షిణాంధ్ర ప్రాంతాల్లో మొహరించబడ్డాయి.

 • 24 Nov 2020 16:20 PM (IST)

  చెన్నైని ముంచెత్తిన భారీ వర్షం

  నివర్ తుఫాను బీభత్సం షురూ.. చెన్నైలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

  బుధవారం సాయంత్రం  తమిళనాడు తీరం దాటనున్న నివర్ తుఫాను ప్రభావం చెన్నై మహా నగరంపై ప్రారంభమైంది. చెన్నై నగరాన్ని మంగళవారం మధ్యాహ్నం భార వర్షం  ముంచెత్తింది. కుండపోతగా కురిసిన భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్థంభించిపోయింది. పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. రెండ్రోజుల పాటు తుఫాను ప్రభావం వుంటుందని చెబుతున్నారు.