ఎలాంటి పరీక్షలు లేకుండానే.. ఫ్యాటీ లివర్ వ్యాధిని గుర్తించవచ్చు.. ఎలాగంటే..
ప్రస్తుత కాలంలో ఫ్యాటీ లివర్ అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఇప్పుడు పెద్ద వారితోపాటు యువత కూడా కొవ్వు కాలేయం సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే.. కొన్ని సంకేతాలతో మీరు ఇంట్లోనే ఫ్యాటీ లివర్‌ను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఎటువంటి పరీక్షలు లేకుండానే కొవ్వు కాలేయాన్ని ఎలా గుర్తించవచ్చు..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ వ్యాధి చాలా సాధారణ సమస్యగా మారింది. చాలా మందికి దీని గురించి తెలియదు.. కానీ కాలక్రమేణా, ఇది తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ ఆల్కహాల్ లేని ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా వస్తుందని మీకు తెలుసా?.. అవును.. ఉరుకులు పరుగుల జీవితంలో నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఫ్యాటీ లివర్ ప్రారంభ సంకేతాలను గుర్తించడం ద్వారా దానిని నివారించవచ్చు. హార్వర్డ్ – AIIMS-శిక్షణ పొందిన లివర్ స్పెషలిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి, ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రారంభ సంకేతాలను సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలో పంచుకున్నారు. ఫ్యాటీ లివర్ సాధారణ సమస్యగా మారుతున్న తరుణంలో శరీరం ఇచ్చే కొన్ని సంకేతాలను అస్సలు విస్మరించకూడదని పేర్కొన్నారు.
డాక్టర్ సేథి ప్రకారం.. ఉదరం చుట్టూ కొవ్వు పెరగడం ఫ్యాటీ లివర్‌కు సంకేతం కావచ్చు. కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు, అది శరీరం మధ్యలో కొవ్వు పెరగడానికి దారితీస్తుంది. ఉదరంలో బరువు పెరిగే వ్యక్తులకు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
నిరంతరం అలసట: స్పష్టమైన కారణం లేకుండా మీరు అలసిపోయినట్లు లేదా బలహీనంగా అనిపిస్తే, అది ఫ్యాటీ లివర్ సంకేతం కావచ్చు. వైద్యుల అభిప్రాయం ప్రకారం, కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు, అలసట కొనసాగుతుంది. అందువల్ల, మీరు స్పష్టమైన కారణం లేకుండా అలసిపోయినట్లు, నీరసంగా అనిపిస్తే, దానిని విస్మరించవద్దు.
కుడి వైపున పక్కటెముకల కింద నొప్పి: కాలేయం ఉదరం కుడి ఎగువ భాగంలో ఉంటుంది. మీరు ఆ ప్రాంతంలో తేలికపాటి నొప్పి లేదా భారాన్ని అనుభవిస్తే, అది ఫ్యాటీ లివర్ లేదా వాపునకు సంకేతం కావచ్చు. పక్కటెముకల కింద నొప్పిని అస్సలు విస్మరించవద్దు.
చర్మంపై మచ్చలు – మొటిమలు: ఫ్యాటీ లివర్ – ఇన్సులిన్ నిరోధకత మధ్య ప్రత్యక్ష సంబంధం ఉంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు, చర్మం నల్లబడటం ప్రారంభమవుతుంది. కొంతమందికి ముఖంపై మొటిమలు కూడా పెరుగుతాయని సేథీ వివరించారు.
ఆకలి లేకపోవడం: ఆకలి లేకపోవడం కూడా ఫ్యాటీ లివర్ కి సంకేతం కావచ్చు. కాలేయంపై ఒత్తిడి పెరిగినప్పుడు.. అది సరిగ్గా పనిచేయదు.. దీనివల్ల ఏదైనా తినాలనే కోరిక తగ్గుతుందని.. డాక్టర్ సౌరభ్ సేథి తెలిపారు.
View this post on Instagram
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని.. వారు చెప్పిన విధంగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్యను అధిగమించవచ్చని డాక్టర్ తెలిపారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




