అగ్రరాజ్యాల బాటలో ఏకతాటిపై త్రివిధ దళాలు

దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ రక్షణలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ త్రివిధ దళాలలను ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియకు అడుగులు పడ్డాయి. ఇంతకాలం భారతదేశ సరిహద్దులను కాపాడుతూ వస్తున్న ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు ఉమ్మడిగా ఒకే అధికారి నాయకత్వం వహించనున్నారు. మరింత సమర్థవంతమైన సమన్వయం సాధిస్తూ మెరుగైన పనితీరు కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌(సీడీఎస్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీడీఎస్ నేపథ్యం దేశ రక్షణకు ఎదురవుతున్న సవాళ్లు కేవలం సరిహద్దుల్లో మాత్రమే లేవు. […]

అగ్రరాజ్యాల బాటలో ఏకతాటిపై త్రివిధ దళాలు
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Jan 03, 2020 | 3:16 PM

దేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ రక్షణలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ త్రివిధ దళాలలను ఏకతాటిపైకి తెచ్చే ప్రక్రియకు అడుగులు పడ్డాయి. ఇంతకాలం భారతదేశ సరిహద్దులను కాపాడుతూ వస్తున్న ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ విభాగాలకు ఉమ్మడిగా ఒకే అధికారి నాయకత్వం వహించనున్నారు. మరింత సమర్థవంతమైన సమన్వయం సాధిస్తూ మెరుగైన పనితీరు కోసం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌(సీడీఎస్)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

సీడీఎస్ నేపథ్యం

దేశ రక్షణకు ఎదురవుతున్న సవాళ్లు కేవలం సరిహద్దుల్లో మాత్రమే లేవు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం రూపురేఖలు మారిపోయి సరిహద్దులతో సంబంధం లేకుండా శతృదేశాలు సైబర్, స్పేస్ వార్ చేస్తున్నాయి. టెర్రరిజం రూపంలో పరోక్ష యుద్ధ తంత్రాలు చాలాకాలం నుంచే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం నింగి, నేల, సముద్రంపై మాత్రమే రక్షణ వ్యవస్థ ఉంటే సరిపోదు. సైబర్ ప్రపంచం, అంతరిక్షంలోనూ దేశ సంపదను రక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ తోడు యుద్ధం లేదా సరిహద్దు రక్షణ వ్యవహారాల్లో మూడు విభాగాలు మరింత సమన్వయంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అగ్రరాజ్యాలు ఇప్పటికే ఎన్నో సంస్కరణలు చేపడుతూ రక్షణ వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా భారీ స్థాయి సంస్కరణలకు ప్రభుత్వం నడుం బిగించింది.

ఈ మేరకు కార్గిల్ యుద్ధ సమయంలో ఎదురైన అనుభవాల నుంచి త్రివిధ దళాల మధ్య మరింత సమన్వయం సాధించే వ్యవస్థ ఉండాలని కార్గిల్ రివ్యూ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. దీంతో పాటు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్ట్, టాస్క్ ఫోర్స్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ, శెకాట్కర్ కమిటీ సీడీఎస్ పదవి ఏర్పాటుకు బలంగా సిఫార్సు చేశాయి.

సీడీఎస్ పదవీ కాలం

అధికారికంగా గెజిట్‌లో ప్రచురించిన మేరకు సీడీఎస్ పదవికి గరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లు. అయితే సీడీఎస్‌గా నియమితులైన వ్యక్తి ఎంతకాలం పాటు పదవిలో ఉండాలన్నది మాత్రం గెజిట్‌లో పేర్కొనలేదు. సాధారణంగా ఆర్మీ, నావికాదళం, వాయుసేన విభాగాలకు అధిపతులుగా వ్యవహించేవారికి గరిష్ట వయో పరిమితి 62 ఏళ్లు. ఈ పదవుల్లో నియమితులైన అధికారులకు గరిష్టంగా మూడేళ్లు లేదా ఈలోపు 62 ఏళ్లు నిండితే అప్పటి వరకు పదవిలో ఉండొచ్చు.

అధికారాలు

కేంద్ర కేబినెట్ ఆమోదించిన ప్రకారం సీడీఎస్ పదవిలో ఉండే వ్యక్తి 4 నక్షత్రాలు కలిగిన జనరల్ ర్యాంక్ అధికారి అయి ఉండాలి. నేరుగా రక్షణ మంత్రిత్వ శాఖ ఆధీనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మిలటరీ ఎఫైర్స్ విభాగానికి అధిపతిగా సీడీఎస్ వ్యవహరిస్తారు. అలాగే రక్షణశాఖ మంత్రికి ప్రిన్సిపల్ మిలటరీ అడ్వైజర్‌గా వ్యవహరించడంతో పాటు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకి ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తారు. అలాగే ఆయనకు రక్షణశాఖ కార్యదర్శి అధికారాలు కూడా ఉంటాయి. వీటితో పాటు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, డిఫెన్స్ ప్లానింగ్ కమిటీల్లో సీడీఎస్ ఒక సభ్యుడిగా కొనసాగుతారు.

సీడీఎస్ పదవి కొత్తగా ఏర్పాటైనప్పటికీ మూడు విభాగాలకు యధావిధిగా అధిపతులు కొనసాగుతారు. ఆయా విభాగాలకు సంబంధించిన అంశాలపై వారు నేరుగా గతంలో మాదిరిగానే రక్షణ మంత్రికి సలహాలు, సూచనలు చేయవచ్చు. అయితే 3 విభాగాలను సమన్వయపరుస్తూ తీసుకోబోయే నిర్ణయాలు, చేపట్టే సరికొత్త సంస్కరణల విషయంలో సీడీఎస్ పాత్ర కీలకంగా మారనుంది.

దేశ సరిహద్దుల్లోనే కాకుండా దేశ సంపదకు నష్టంవాటిల్లే సైబర్ దాడులను నియంత్రించే వ్యవస్థలు, అంతరిక్షంలో భారత సంపదైన శాటిలైట్లను రక్షించుకునే విభాగాలు నేరుగా సీడీఎస్ పరిధిలో ఉంటాయి.

ఒకే గొడుగు కిందకు మూడు విభాగాలు : అనేక ఉపయోగాలు

సీడీఎస్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి మూడేళ్లలో త్రివిధ దళాల మధ్య నిర్వహణ, రవాణా, శిక్షణ, అనుబంధ సేవలు, కమ్యూనికేషన్, మరమ్మతు అంశాల్లో సమన్వయం సాధించాల్సి ఉంటుంది. సీడీఎస్ నేతృత్వం వహించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ మిలటరీ ఎఫైర్స్ మూడు విభాగాల్లో సిబ్బంది సమీకరణ, శిక్షణ అంశాలను కూడా ఏకీకృతం చేయాల్సి ఉంటుంది.

వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మిలటరీ కమాండ్స్‌ను పునర్వ్యవస్థీకరించడంతో పాటు ఆపరేషన్స్ అన్నీ సంయుక్తంగా చేపట్టేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు జాయింట్ కమాండ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న చైనా థియేటర్ కమాండ్స్ ఏర్పాటు చేసింది. అంటే ఇందులో ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సంయుక్తంగా కలిసి పనిచేయనున్నాయి.

వివిధ దేశాల్లో ఆపరేషన్స్ నిర్వహించే అమెరికన్ సైనికుల విషయంలోనూ ఈ తరహా ప్రయోగం ఇప్పటికే అమల్లో ఉంది. అక్కడ పనిచేసే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ సైనికులకు ఉమ్మడిగా కమాండర్ ఉంటారు. మన దేశంలో సరిహద్దులు పర్యవేక్షించేందుకు ఆర్మీకి నార్తర్న్ కమాండ్, వెస్ట్రన్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఈస్టర్న్ కమాండ్, సదరన్ కమాండ్, సౌత్ వెస్ట్రన్ కమాండ్, ట్రైనింగ్ కమాండ్ పేరుతో మొత్తం 7 కమాండ్స్ ఉన్నాయి. అలాగే ఎయిర్‌ఫోర్స్ లోనూ ప్రాంతాలవారిగా కమాండ్స్ ఉన్నాయి.

దేశానికి తూర్పు, పశ్చిమ, దక్షిణ దిక్కుల్లో సముద్రం ఉన్నందున ఈస్టర్న్, వెస్టర్న్, సదరన్ నావల్ కమాండ్స్ ఉన్నాయి. అయితే ప్రాంతాలవారిగా వీటిని సంయుక్తంగా థియేటర్ కమాండ్స్ ఏర్పాటు చేయడం వల్ల యుద్ధం, తదితర ఆపరేషన్స్ సమయంలో వనరుల వినియోగం నుంచి అన్ని విషయాల్లోనూ సమర్థత పెరగనుంది. ఈ దిశగా అవసరమైన చోట థియేటర్ కమాండ్స్ ను కూడా సీడీఎస్ ఏర్పాటు చేయనున్నారు.

అలాగే మూడు విభాగాల్లోనూ హెలీకాప్టర్లు, విమానాల వినియోగం ఉంటుంది. ఆర్మీలో సైనికుల తరలింపు కోసం, సరంజామా తరలింపు కోసం హెలీకాప్టర్లు, రవాణా విమానాలు వినియోగిస్తున్నారు. నేవీలోనూ వీటి ఉపయోగం ఉంది. అయితే ఇప్పటి వరకు కొనుగోళ్లు ఏ విభాగానికి వారు తమ అవసరాల రీత్యా కొంటూ వస్తున్నారు. ఇప్పుడు సీడీఎస్ ఏర్పాటు కావడంతో మూడు విభాగాల్లో ఈ తరహా ఆపరేషన్స్ ఏకీకృతమవడంతో పాటు కొనుగోళ్లలోనూ ఒకేసారి పెద్ద సంఖ్యలో కొనడం వల్ల రాయితీ లభించే అవకాశం ఉంటుంది. అలా రక్షణకు అవసరమైన నిధులను, వనరులను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే ఆస్కారం ఏర్పడుతుంది.

మూడు విభాగాలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నింటినీ కలుపుతూ ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే ఒకే చోట ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ హెడ్‌క్వార్టర్స్ ఉండేలా ఏర్పాటు చేస్తూ, వాటితో పాటు ఇతర అనుబంధ విభాగాల ప్రధాన కార్యాలయాలు కూడా ఒకే గొడుగు కిందకు వచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.