ఆర్టికల్ 370 నిజంగా రద్దయిందా ..? దీన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేయవచ్చా ..?

ARTICLE 370, ఆర్టికల్ 370 నిజంగా రద్దయిందా ..? దీన్ని కోర్టుల్లో ఛాలెంజ్ చేయవచ్చా ..?

జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసింది. కాశ్మీర్ ను లడఖ్, జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించినప్పటికీ.. ఈ అధికరణాన్ని పార్లమెంటు ఆమోదించాల్సిన అవసరం లేదు. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపంలో ఉండడమే ఇందుకు కారణమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏమైనా.. ఈ అధికరణాన్ని నిజంగా రద్దు చేశారా ? ఇది 35 ఏ అధికరణంపై ప్రభావం చూపుతుందా ? కోర్టుల్లో దీన్ని సవాల్ చేయవచ్చా ? ఇవి ఇప్పుడు వీరిని వేధిస్తున్న ప్రశ్నలు.. ఎలా చూసినా ఇందులోని న్యాయాన్యాయాలను ఒకసారి బేరీజు వేసుకోవలసిందే..
మొదట ఇది 1954 నాటి జమ్మూకాశ్మీర్ ఆర్డర్ ని రద్దు చేస్తోంది. అంటే ఇందులో జొప్పించిన ఆర్టికల్ 35 ఏ కూడా ఆటోమాటిక్ గా తొలగిపోయినట్టే.. 1954 నాటి ఆర్డర్ లో ఈ అధికరణాన్ని కూడా చేర్చారు. దీంతో కాశ్మీర్లో శాశ్వత నివాసాలు కానివారు ఆస్తులను కొనరాదన్న నిబంధన తొలగినట్టే.. పైగా కాశ్మీర్ రాజ్యాంగానికి సంబంధించిన అన్ని నిబంధనలూ ఈ రాష్ట్రానికి వర్తిస్తాయి. గతంలో ఆర్టికల్ 1, ఆర్టికల్ 370 ప్రకారం.. ఈ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాకే రాష్ట్రపతి నోటిఫై చేసేవారు. రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్ వంటివాటికి సంబంధించిన చట్టాలు ఈ రాష్ట్రానికి వర్తించేవి కావు. ఉదాహరణకు పీనల్ కోడ్ వంటివి.. కానీ తాజా ఉత్తర్వులు ఈ ఆంక్షలను ఎత్తివేసినట్టే. అసలు ఈ ఉత్తర్వుల వల్ల కాశ్మీర్ ప్రయోజనం పొందుతుందా ? ఆర్టికల్ 370 (3) కింద అసలైన ఈ అధికరణాన్నీ రద్దు చేయాలంటే ఇందుకు జమ్మూకాశ్మీర్ చట్ట సభ (కాన్స్ టిట్యుయెంట్ అసెంబ్లీ) సిఫారసు అవసరం. కానీ అది
సాధ్యమయ్యే పని కాదు. 1956 లోనే అది రద్దు కావడమే ఇందుకు కారణం. అంటే ఈ నిబంధన పూర్తిగా రద్దయినట్టు కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. ఆర్టికల్ 370 తాత్కాలికం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. అసలు తాజా ఆర్డర్ సభ ఆమోదం పొందిందా అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది.
రాష్ట్రపతి కేవలం రాష్ట్ర గవర్నర్ తో సంప్రదించారు తప్ప.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో కాదు.. అందువల్ల ఈ ఆర్డర్ చెల్లుబాటు కాదు.. ఈ నేపథ్యంలో కేంద్రం కొత్త క్లాజును ఇందులో చేర్చాల్సి ఉంది. కానీ అలా జరగలేదు గనుక అయోమయ పరిస్థితి ఏర్పడింది. ఇది న్యాయ నిపుణుల అభిప్రాయం. పైగా 1952 నాటి ఢిల్లీ ఒప్పందం ప్రకారం.. తాము ఇండియాలో భాగమవుతామని జమ్మూ కాశ్మీర్ నాడు అంగీకరించింది. అంటే చట్ట సభ రద్దు కాకముందే ఇది జరిగింది. దీన్ని నివారించేందుకా అన్నట్టు కేంద్రం కొత్త ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన కావచ్చునని వారి భావన.. కాశ్మీర్ చట్ట సభ రద్దయింది గనుక.. రాష్ట్రపతి ఈ ఆర్టికల్ కూడా రద్దయినట్టేనని భావించారా ? అందుకే ప్రభుత్వం ఈ చర్య తీసుకుందా ? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిబంధనను సవరించే అధికారం పార్లమెంటుకు ఉన్నప్పటికీ ఇది జ్యూడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుంది. ఇది అంత సులువైన పని కాదని లీగల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *