చింతపై జీఎస్టీ తీపి కబురు.. అంతేకాదు ఇక హోటల్ గదులపై..!

GST Council Cuts Tax Rate on Hotel Room Tariffs; Caffeinated Drinks to Get Costlier, చింతపై జీఎస్టీ తీపి కబురు.. అంతేకాదు ఇక హోటల్ గదులపై..!

శుక్రవారం జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 37వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. సామాన్యులకు ఊరట ఇచ్చే తీపి కబుర్లను చెప్పింది. ఇప్పటికే దేశీయ కంపెనీలపై కార్పొరేట్ పన్ను తగ్గించిన మోదీ సర్కార్.. తాజాగా అనేక వస్తువులపై జీఎస్టీ రేట్లను సవరించింది. ఇందులో ముఖ్యంగా హోటల్ గదులపై జీఎస్టీ పన్ను తగ్గింపు, వెట్ గ్రైండర్లపై పన్ను తగ్గింపు, అదే విధంగా చింతపండుపై పన్ను మినహాయింపు, రక్షణ ఉత్పత్తులపై పన్నుమినహాయింపు గడువు పొడగింపు తదితర అంశాలు ప్రధానంగా ఉన్నాయి. భారత్‌లో జరిగే ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమయ్యే వస్తువులు, సేవలపై జీఎస్టీ మినహాయింపు ఇస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కేఫినేటెడ్‌ బేవరేజస్‌పై జీఎస్టీని 18 నుంచి 28 శాతానికి పెంచారు. దీనికి 12 శాతం సెస్‌ను అదనంగా జోడించారు. ఇక పెట్టుబడులను ప్రోత్సహించేందుకు దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్ను 22 శాతానికి తగ్గించారు. నూతన తయారీ రంగ సంస్థలు 15 శాతం పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇక హోటల్‌ గదుల విషయంలో జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఒక రాత్రికి వెయ్యి రూపాయలు లోపు ఉండే హొటల్ గదులకు జీఎస్టీని ఎత్తివేశారు. ఇక రూ.1001 నుంచి 7,500 ఉండే గదులకు జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు. రూ.7,500 అంతకు పైగా ఉండే గదులకు 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించారు. అంతేగాక ఔట్‌ డోర్‌ కేటరింగ్‌పై విధించే 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు.

మెరైన్‌ ఫ్యూయెల్‌పై జీఎస్టీ 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. అంతేకాదు చింతపండుపై ఇప్పటి వరకు ఉన్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేశారు. ఇక వెట్‌ గ్రైండర్లపై 12 శాతం ఉన్న జీఎస్టీని.. 5 శాతానికి తగ్గించారు. ఇవిగాక.. దేశ రక్షణ రంగానికి సబంధించిన ఉత్పత్తులకు సంబంధించి జీఎస్టీకి మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు 2024 వరకు ఉండనుంది. ఫిఫాకు అందించే వస్తువులు, సేవలపై భారత్‌లో జరిగే ఫిఫా అండర్‌-17 మహిళల టోర్నీ వరకు మినహాయింపు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో తీసుకున్న మార్పులన్నీ అక్టోబరు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సీతారామన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *