గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వేరుశెనగ

, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వేరుశెనగ

ఆరోగ్యం అనగానే ముందుగా ఆహారం గుర్తొస్తుంది. ప్రధానంగా ఆయిల్. వంట నూనెల పేరు చెప్పగానే గుండె అదురుతుంది. అందుకే ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మరి ఏ అడ్డంకులూ లేకుండా ఒక వంటనూనె వాడొచ్చని శాస్త్ర వేత్తలు భరోసా ఇస్తే.. అంతకంటే మంచి వార్త ఏముంటుంది.

హైదరాబాద్ కేంద్రంగా ఇక్రిసాట్-అంతర్జాతీయ వ్యవసాయ సంస్థ సృష్టించిన వేరుశెనగ.. గుండె వ్యాధులకు దూరంగా ఆరోగ్య ఔషదంగా మారిపోతోంది. ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్‌లా శాస్త్రవేత్తలు తయారుచేసిన వేరుశెనగ.. ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు రూపొందించిన వేరుశెనగ వంగడం. దీన్ని అభివృద్ధి చేయడానికి సుమారు ఎనిమిది సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఇక్రిసాట్ వృద్ధి చేసిన ఈ నూనె గింజకు వివిధ సంస్థలు సాయం పట్టాయి. అందులో ప్రధాన పార్ట్‌నర్‌గా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్‌తో పాటు.. ఆచార్య జయశంకర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు తమ వంతు సాయం చేశాయి.

కేవలం గుండె సంబంధిత వ్యాధులకు దూరంగానే కాదు. ఈ రోజుల్లో ఆయిల్ వాడితే బరువు పెరుగుతామని.. సౌందర్య పోషణకు అడ్డంకి ఉంటుందనే ఆలోచనలకు కూడా ఈ వేరుశెనగ నుంచి తీసిన ఆయిల్ మంచి పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓలిక్ యాసిడ్ అధికంగా ఉండే వంగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. సాధారణంగా వంటనూనెల్లో ఓలిక్‌యాసిడ్స్ 20 నుంచి 40 శాతం లోపు మాత్రమే ఉంటాయి. కాని అనూహ్యంగా ఈ వేరుశెనగ వంగడంలో 80 శాతం వృద్ధి చేయడం అంటే ఆషామాషీ కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

ఇప్పటికే నూనెల వల్ల రోగాలతో ముఖ్యంగా వేరుశెనగ నూనె వాడకం తగ్గిపోయింది. ఎంతగా అంటే ఎనిమిది మిలియన్ హెక్టార్ల సాగు నుంచి మిలియన్ హెక్టార్లకు పడిపోయింది. దిగుబడి లేకపోవడంతో రైతులు పంట వేయడానికి ముందుకు రావడం లేదు. అలాంటి పరిస్థితుల మధ్య ఈ వంగడం ద్వారా ఆరోగ్యమే కాదు.. వేరుశెనగ పంట వృద్ధి కూడా సాధిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

త్వరలోనే దేశంలో ఎంపిక చేసిన వివిధ రాష్ట్రాల్లో రైతాంగానికి ఈ నూతన ఆవిష్కరణ విత్తనాలను అందిస్తామని ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకూ వృద్ధి చేసిన రెండు రకాల వంగడాలు ద్వారా.. వచ్చే ఫలితాలను చూసి మరిన్ని మార్పులు చేస్తామంటున్నారు. కొద్ది రోజుల్లోనే ఇక్రిసాట్ ఆవిష్కరణ వంటనూనెగా రాబోతుంది. ఈ వేరుశెనగ నూనె అందుబాటులోకి వస్తే.. గుండె జబ్బుల భయం లేకపోవడమే కాదు.. హృద్రోగుల శాతం తగ్గే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *