ఎన్టీఆర్‌కు భారతరత్న: రాకపోవడానికి కారణమిదే

తెలుగు నట సింహాం నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఆయన ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు అవార్డు రావడం లేదనే విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని […]

ఎన్టీఆర్‌కు భారతరత్న: రాకపోవడానికి కారణమిదే
Follow us

|

Updated on: Jan 18, 2020 | 1:49 PM

తెలుగు నట సింహాం నందమూరి తారక రామారావు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు. తెలుగుజాతి కీర్తి కిరీటాలను దశదిశలా వ్యాపింప చేసిన ఘనుల్లో ఆయన ఒకరు. తెలుగు ఖ్యాతిని ఆయనలా ప్రపంచానికి చాటిన మరో ముఖ్యమంత్రి లేరంటే అతిశయోక్తి కాదేమో. అలాంటి విశ్వ విఖ్యాత నట సౌర్వభౌముడికి భారతరత్న అవార్డు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఎందుకు అవార్డు రావడం లేదనే విషయం పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని తెలుగు దేశం పార్టీ అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ప్రభుత్వమే కాదు నందమూరి కుటుంబ సభ్యులు, వారి అభిమానులు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరారు. వీరితో పాటు ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి హస్తినకు వెళ్లి మరీ అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అయినా లక్ష్మీ పార్వతి వెనక్కు తగ్గడం లేదు. మరోసారి ఆందోళన చేసేందుకు సిద్దమవుతోంది. గత పరిస్థితులు వేరు, ఇప్పడు వేరు. కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ ప్రభుత్వం. ఏపీలో అధికారంలో ఉంది వైసీపీ సర్కార్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల విషయంలో రకరకాల అభిప్రాయాలున్నాయి. ఏపీకి అనుకూలమని కొందరంటే..కాదు దూరం దూరం అంటున్నారు ఇంకొందరు. విషయం ఏదైనా ఎన్టీఆర్ కు భారతరత్న తీసుకు రావడం కష్టం కాదనే వాదనుంది. కానీ కొన్ని శక్తులు ఆయనకు అవార్డు రాకుండా అడ్డుకుంటున్నాయనే వాదన లేకపోలేదు. ఫలితంగా అన్నగారికి భారతరత్న రావడం అంత తేలిక కాదంటారు. ఎన్టీఆర్‌కు భారతరత్న వస్తే ఆ అవార్డును ఆయన భార్యగా లక్ష్మీపార్వతి తీసుకునే వీలుంది. అది ఇటు నందమూరి ఫ్యామిలీకి కానీ, తెలుగు దేశం పార్టీకి గానీ నచ్చుతుంగా అనే చర్చ సాగుతోంది. ఎన్టీఆర్‌ పేరును టీడీపీ గతంలో భారతరత్నకు సిఫారుసు చేసినా వస్తుందా లేదా అనేది సంశయం ఏర్పడింది.

మహానాడు వేదికగా ఎన్టీఆర్ కు భారతరత్నఅవార్డు ఇవ్వాలని టీడీపీ చాలా సార్లు డిమాండ్ చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబునాయుడు స్వయంగా ఈ అవార్డు గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఎన్టీఆర్ వల్లనే తాము రాజకీయాలు నేర్చుకున్నామన్నారు. ఆయన తమకు మార్గదర్శకుడన్నారు. మనసులో మాటే బాబు బయటకు చెప్పారా లేదా అన్న సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్ గురించి మాట్లాడారనేది నిజం. తన తండ్రికి భారతరత్న అవార్డు ఇవ్వాలనేది హరికృష్ణ ఎప్పటి నుంచో అడుగుతున్న మాట. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని టీడీపీ ఎన్నో ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూనే ఉంది. సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాలు ఆ సిఫార్సును పెద్దగా పట్టించుకోలేదు.

భారతరత్నల అవార్డు చరిత్ర చూస్తే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కరికీ ఆ గౌరవం దక్కలేదు. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన 1954లో తమిళనాడుకు మూడు అవార్డులొచ్చాయి. తెలుగు మూలాలు ఉన్న ముగ్గురికి భారతరత్నలు లభించాయని అనుకోవలసిందే తప్ప, తెలుగు రాష్ట్రాల నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు.

ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు భారతరత్న అవార్డు వచ్చింది. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లే. మూడు వందల ఏళ్ల కిందట వారి పూర్వీకులు మైసూరుకు వలస వెళ్లారు. ఆయన ఇంటిపేరును బట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మోక్షగుండం వారి ఊరని, వారి పూర్వీకులు తెలుగువారని తేలింది. మోక్షగుండంకు 1955లో భారతరత్న అవార్డు లభించింది. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనకు 1954లో భారతరత్న అవార్డు లభించింది. రాధాకృష్ణ పుట్టింది మద్రాసు ప్రెసిడెన్సిలోని తిరుత్తనిలో. అదీ తెలుగు కుటుంబంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులోని తిరువత్తూరు జిల్లాలో ఉంది. మరో నేత వివి.గిరికి భారతరత్న లభించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని బరంపురంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం బరంపురం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణది తెలుగు కుటుంబమే అయినా భారతరత్న మాత్రం తమిళనాడు లెక్కల్లోనే చూపారు.

తెలుగువారిలో భారతరత్న అవార్డు ఇవ్వాల్సి వస్తే ఎన్టీ రామారావు, పివి నరసింహారావులది తొలి స్థానం. 1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజి రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని నడిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవ చేశారు. ప్రముఖ సినీనటుడు. ఎన్టీఆర్‌కు దాదాపు అవే అర్హతలున్నాయి. ఈ విషయంలో ఎంజీఆర్ కు ఎన్టీఆర్ కు దగ్గర పోలికలున్నాయి. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు భారతరత్న కోసం పెద్దగా ప్రయత్నించలేదని లక్ష్మీ పార్వతి లాంటి వారి ఆరోపణ. గతంలోనే ఎన్టీఆర్‌కు అవార్డు వచ్చే అవకాశమున్న తప్పిపోయిందంటారు. ఇప్పట్లో తెలుగువారికి అవార్డు ఎండమావే అనే వాదన సాగుతోంది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, సినిమా నటునిగా తెలుగువారిపై చూపిన ప్రభావం సామన్యమైనదేమీ కాదు. తెలుగులో ఆయన గొప్ప నటుడు. ఈ విషయం కాదనేవారుండరు. ఎన్టీఆర్ మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, కులాలకు అతీతంగా సమాజం బాగుండాలని కోరుకున్న వ్యక్తి అన్నారు వాళ్లు. ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లోని దృశ్యాలతో చిత్రాలు రూపొందించారు లక్షలాది రూపాయలు ఖర్చైయిన వెరవక టీవీల్లో అరగంటలకు అరగంటల ఎపిసోడ్లును ప్రసారం చేయించారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న అవార్డు గురించి ఉద్యమించాలంటున్నారు అభిమానులు.

ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందనే ఆరోపణలున్నాయి. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం తెలుగువాళ్లకు ద్రోహం చేయడమేనని అనేకసార్లు మహానాడులో ఆవేదన వ్యక్తమైంది. అయితే అదంతా గతం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరింతగా పావులు కదిపితే బాగుండేదనే వాదనుంది. ఎన్టీఆర్‌ కు అవార్డు ప్రకటిస్తే ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి హస్తినకు వెళ్లి రాష్టప్రతి చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందుకోవాల్సి ఉంటుంది. అది ఆమెను వ్యతిరేకించే వారికి మింగుడుపడని అంశమే. మరణించిన వ్యక్తికి భారతరత్న ఇస్తే నిబంధనల ప్రకారం దానిని తీసుకునే అర్హత భార్యకే ఉంటుంది. ఒకవేళ ఆమె కూడా లేకపోతే వాళ్ల సంతానం వెళ్లి అవార్డును అందుకోవచ్చు. ఎన్టీఆర్‌ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి. ఒకవేళ భారత రత్న అవార్డు ఎన్టీఆర్ కు వస్తే ఢిల్లీ నుంచి పిలుపు ఆయన సతీమణి లక్ష్మీపార్వతికే వస్తుంది. ఒకవేళ లక్ష్మీపార్వతికి ఆహ్వానం దక్కకుండా, ఎన్టీఆర్‌ సంతానం వెళ్లి దానిని అందుకొనే ఏర్పాటు చేసినా ఆ తర్వాత వివాదం రేగడం ఖాయం. ఈ విషయంలో లక్ష్మీపార్వతి ఎలాగూ వెనక్కుతగ్గదు. మీడియాలోను రచ్చకెక్కుతుంది. ఆ విధంగా ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు విషయంలో గొడవలు వచ్చే వీలుంది. అది ఎన్టీఆర్‌కు, భారతరత్నకు రెండింటికీ అవమానం అని భావిస్తున్నారు పలువురు ప్రముఖులు.

ఢిల్లీలో తెలుగువాళ్ల పరువు పోకుండా ఉండాలంటే ఇవన్నీ జరగకూడదనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే కేంద్ర పభుత్వం ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సి వస్తే పురస్కార పత్రాన్ని లక్ష్మిపార్వతి చేతిలో పెట్టే అవకాశాలే ఎక్కువగా వున్నాయి. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే ఏపి మంత్రి మండలి తీర్మానించింది. భారతరత్న అవార్డు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన జాబితాలో ఎన్టీఆర్ పేరు లేదని కేంద్ర ప్రభుత్వమే గతంలో ప్రకటించింది. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మహానాడులో భారతరత్న అవార్డు కోసం ఎన్టీఆర్ పేరు పంపించాలని తీర్మానం చేశారు. 2015లో జరిగిన మహానాడులోను. ఆ తర్వాతను అదే పని చేశారు. చంద్రబాబు సిఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ పద్మ అవార్డుల కోసం ప్రతిపాదించిన జాబితాలో ఎన్‌టీఆర్ పేరు భారతరత్నకు సిఫారసు చేయలేదు. దీంతో దివంగత ఎన్‌టీఆర్‌కు భారతరత్న అవార్డు దక్కే అవకాశం లేకుండా పోయిందంటారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ విషయంలో ఎలా స్పందిస్తుందో అన్న చర్చ సాగుతోంది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరును ఎందుకు సిఫార్సు చేయకూడదంటూ గతంలోనే సిఎం జగన్ ప్రస్తావించారు. ఇప్పుడు అదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎన్టీఆర్ కు అవార్డు ఇవ్వాలని కేంద్రానికి సిఫార్సు చేస్తుందా..లేదా అనేది ఉత్కంఠను పెంచుతోంది.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు. టీవీ9.