మళ్ళీ పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ బిల్లు

GOVT. WILL REINTRODUCE TRIPLE TALAQ BILL IN HOUSE SAYS RAVI SHANKER PRASAD, మళ్ళీ పార్లమెంటులో ట్రిపుల్  తలాక్ బిల్లు

వివాదాస్పదమైన ట్రిపుల్ తలాక్ బిల్లును మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెడతామని ప్రభుత్వం ప్రకటించింది. మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకునే పధ్దతి శిక్షార్హ నేరమని,ఇందుకు మూడేళ్ళ జైలుశిక్ష విధించవచ్చునని ఈ బిల్లు నిర్దేశిస్తోంది. ట్రిపుల్ తలాక్ నిషేధం అన్నది తమ పార్టీ రాజకీయ మేనిఫెస్టోలో భాగమని, మోదీ ప్రభుత్వంలో తిరిగి న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అందువల్లే ఈ బిల్లును మళ్ళీ పార్లమెంటులో ప్రవేశపెడతామన్నారు. ఈ బిల్లును గత డిసెంబరులో లోక్ సభ ఆమోదించినప్పటికీ..రాజ్యసభలో ఇది ఇంకా పెండింగులో ఉంది. దీన్ని పార్లమెంటు సంయుక్త కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతూ వచ్చాయి. బిల్లులోని కొన్ని అంశాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని, వాటిని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విపక్షాలు కోరుతున్నాయి. కానీ వారి డిమాండును తోసిపుచ్చిన ప్రభుత్వం.. ముస్లిం మహిళల వైవాహిక హక్కుల పరిరక్షణ ఆర్డినెన్స్-2019 ను రెండు సార్లు తెచ్చింది. అయితే 16 వ లోక్ సభ రద్దు కావడంతో ఈ ఆర్డినెన్స్ కు కాలదోషం పట్టింది. అటు-ట్రిపుల్ తలాక్ బిల్లును తిరిగి పార్లమెంటులో ప్రవేశపెడతారా అన్న మీడియా ప్రశ్నకు రవిశంకర్ ప్రసాద్.. తప్పకుండా అని స్పష్టం చేశారు. ఇది తమ (బీజేపీ) పార్టీ మేనిఫెస్టోలో భాగమని, ఇందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. . కాగా-జ్యూడిషియల్ పోస్టుల విషయంలో తాను గానీ, తన మంత్రిత్వ శాఖ గానీ పోస్టాఫీస్ వంటి పాత్ర వహించే ప్రసక్తి లేదని, జడ్జీల నియామకంలో తను సుప్రీంకోర్టుతోను, హైకోర్టులతోను సంప్రదింపులు జరుపుతానని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *