ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేదం.. సీఎం జగన్ ఆదేశాలు

Govt Hospital Doctors No private practice AP govt orders, ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై నిషేదం.. సీఎం జగన్ ఆదేశాలు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులుగా విధులు నిర్వహిస్తూ ప్రైవేటు హాస్పిటళ్లు నడుపుతూ ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు ఏపీ ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వారు చేస్తున్న ప్రైవేటు ప్రాక్టీస్‌ను రద్దు చేస్తూ ఆదేశించారు సీఎం జగన్. వీరికి ఆమేరకు జీతాలు పెంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

వైద్య ఆరోగ్యశాఖలో సంస్కరణలు చేపట్టే దిశగా ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుజాతారావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈకమిటీ తన నివేదికను సీఎం జగన్‌‌కు సమర్పించారు. ఈ నివేదికలో దాదాపు 100 సిఫార్సులు చేశారు. వీటిలో గత ప్రభుత్వం చేసిన పలు ఒప్పందాల్లో లోపాలు కూడా కమిటీ బయటపెట్టింది. వీటన్నిటిపై చర్చించిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం జరిగిన వైద్య ఆరోగ్యశాఖ సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ప్రభుత్వాసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెరిగి విధంగా నడుచుకోవాలని, అందుకు తగ్గట్టుగా ఆస్పత్రుల్లో ఫ్యాన్లు, లైట్లు, బాత్‌రూమ్‌లు, ఫ్లోరింగులు, గోడలతో పాటు మంచాలు, దుప్పట్లు అన్నీ మార్చాలని, అవసరమైన చోట ఏసీలు కూడా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ప్రభుత్వాసుపత్రుల దశ, దిశ మారుస్తామని, సిబ్బంది కొరత లేకుండా సదుపాయాలు పెంచాలని కూడా ఆయన ఆదేశించారు.

వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ

ఎన్నికల మేనిఫెస్టోను తూచ తప్పకుండా అమలు చేసే విధంగా ఏపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తున్న ఆరోగ్యశ్రీ సేవలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఆస్పత్రులతో సూపర్ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీని వర్తింపజేయాలని, ఇది నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అదే విధంగా సీఎం జగన్ జన్మదినం డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య కార్డుల జారీని ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఇప్పటికే జాబితాలో ఉన్న వ్యాధులకు అదనంగా మరికొన్ని చేర్చుతూ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. అదే విధంగా వైద్యం ఖర్చు వెయ్యి దాటితే దానికి ఆరోగ్యశ్రీ వర్తించేలా కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఆపరేషన్ చేయించుకున్న వారు కోలుకుంటున్న సమయంలో నెలకు రూ. 5 వేలు చొప్పున సహాయాన్ని చేయాలని కూడా సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *