ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై స్పీడు పెంచిన సర్కార్

విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటుపై ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు దీన్నే సూచిస్తున్నాయి. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు..........

ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌పై స్పీడు పెంచిన సర్కార్
Follow us

|

Updated on: Jul 06, 2020 | 10:16 AM

Executive Capital at Visakha : విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటుపై ప్రభుత్వం స్పీడ్‌ పెంచింది. ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు దీన్నే సూచిస్తున్నాయి. ఒకవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు జరుగుతుండగా, అటు విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు కోసం ప్రభుత్వం తన పని తాను చేసుకుంటోంది.

విశాఖలో మొన్న CMO ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌, నిన్న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి, ఇప్పుడు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పర్యటించడంతో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ఏర్పాటు పనులు వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల క్రితం విశాఖలో పర్యటించిన ప్రవీణ్‌ ప్రకాష్‌.. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ బిమల్‌ పటేల్‌ని తనతో పాటు తీసుకొచ్చి విశాఖలోని స్థలాలను పరిశీలించారు. జూన్‌ 7,8,9 తేదీల్లో విశాఖలో పర్యటించిన ప్రవీణ్‌ ప్రకాష్‌ బిమల్‌ పటేల్‌తో కలిసి మధురవాడ, తిమ్మాపురం, మంగమారిపేట, కాపులుప్పాడ, తొట్లకొండ ప్రాంతాలతో పాటు గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు.

ఆ తర్వాత 15 రోజులకు రెవెన్యూశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉషారాణి విశాఖలో పర్యటించారు. జూన్‌ 22న విశాఖ వచ్చిన ఉషారాణి ఆనందపురం మండలం జగన్నాధపురంలో ఏర్పాటు చేయనున్న గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రానికి కేటాయించిన 385 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు.  ఈ భూమిలో సుమారు 145 ఎకరాల్లో యూకలిప్టస్‌, జీడి, మామిడి తోటలను రైతులు సాగు చేసుకుంటున్నారు. రైతులతో మాట్లాడిన ఉషారాణి, వారందరికీ నష్ట పరిహారం ఇప్పిస్తామని తెలిపారు.

ఉషారాణి పర్యటన 15 రోజులకు ఏపీ పోలీస్ బాస్ గౌతం సవాంగ్ విశాఖలోనే మకాం వేశారు. పోలీసు కార్యాలయాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన భవన సముదాయాల కోసం ఆయన అన్వేషించారు. ఇందుకోసం భీమిలి, మధురవాడలోని కొన్ని ప్రాంతాల్ని ఆయన పరిశీలించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో పలు వివరాలు సేకరించారు.

విశాఖలో రీజనల్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం పరిస్థితులు ఎలా ఉన్నాయో ముందుగా పరిశీలిస్తున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. భద్రత ఏర్పాట్లు కూడా చూసుకోవాలన్నారు.

మరోవైపు మంత్రి అవంతి శ్రీనివాస్‌ కూడా విశాఖ ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ అయితే అభివృద్ధి జరుగుతుందంటున్నారు. దేశంలోని ముంబై, బెంగళూర్‌ లాంటి నగరాలకు దీటుగా విశాఖ డెవలప్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.