ఒక్క క్లిక్‌తో 3లక్షల ఉద్యోగాలు.. అదృష్టం పరీక్షించుకోండి ఇక..!

ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? అయితే ఇక మీకు ఆ పరిస్థితి అక్కర్లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బృహత్తర కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రతిఏటా.. లక్షల మంది యువత ఉన్నతవిద్యను అభ్యసింది ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దళారులు వీరి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని.. వారి వద్ద నుంచి ఉద్యోగాల పేరుతో […]

ఒక్క క్లిక్‌తో 3లక్షల ఉద్యోగాలు.. అదృష్టం పరీక్షించుకోండి ఇక..!
Follow us

| Edited By:

Updated on: Nov 01, 2019 | 8:44 PM

ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా..? ఏదో ఉద్యోగం కోసం కన్సల్టెన్సీలను సంప్రదిస్తూ.. వేలకు వేలు సమర్పించుకుంటున్నారా..? అయితే ఇక మీకు ఆ పరిస్థితి అక్కర్లేదు. ఎందుకంటే నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే బృహత్తర కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశంలో ప్రతిఏటా.. లక్షల మంది యువత ఉన్నతవిద్యను అభ్యసింది ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో దళారులు వీరి నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని.. వారి వద్ద నుంచి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పుడుతున్నారు. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ.. కేంద్రం ఓ వెబ్‌పోర్టల్‌ను రెడీ చేసింది.

ఈ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగం పొందేందుకు మంచి అవకాశాన్ని కల్పించింది. ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్ధులు.. వెంటనే వారికి ఉన్న అర్హతలకు తగిన మంచి ఉద్యోగం సంపాదించేందుకు పోర్టల్‌ను ముందుకు తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వ లేబర్, ఎంప్లాయిమెంట్‍ విభాగం ఆధ్వర్యంలో.. “నేషనల్‍ కెరీర్‍ సర్వీస్‍ పోర్టల్‍” ప్రారంభించింది. ఇది నిరుద్యోగులకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.

దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా.. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సీటీలు నుంచి ఉన్నతవిద్యలు చదువుకున్న వారు లక్షల సంఖ్యలో బయటికి వస్తున్నారు. అయితే యూనివర్సీటీలు, కళాశాలలు నిర్వహించే క్యాంపస్ రిక్రూట్ మెంట్‌ ప్లేస్‌మెంట్‌లో కేవలం 10శాతం మంది విద్యార్ధులు కూడా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఆ తర్వాత ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లలో కోర్సులు చేసి.. మళ్లీ ఉద్యోగ వేట ప్రారంభిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరిని ట్రాప్ చేస్తూ.. మోసాలకు పాల్పుడుతున్నారు కొంతమంది కేటుగాళ్లు. ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలియకపోవడం కూడా ఇందుకు కారణం అవుతోంది. దీంతో స్థానికంగా ఉండే చిన్న చిన్న కంపెనీల్లో ఉండే ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని దేశ వ్యాప్తంగా వివిధ ఐటీ, కార్పొరేట్‍ కంపెనీల్లో ఉన్న జాబ్స్ వివరాలను అందరికి తెలిసేలా.. ఈ నేషనల్‍ కెరీర్‍ సర్వీస్ పోర్టల్‍ను డెవలప్ చేసింది.

చదువుకు తగ్గట్లుగా..

అయితే ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో విద్యార్ధుల చదువుకు తగ్గట్లుగా ఉద్యోగాలు ఉన్నాయి. గ్రాడ్యూయేట్స్, పోస్ట్ గ్రాడ్యూయేట్స్, ఇంజనీరింగ్ చేసిన విద్యార్ధుల వారీగా అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల వివరాలు ఉన్నాయి. నగరాల్లో ఉండే అనేక ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీల వివరాలు.. వాటిలో ఉండే ఉద్యోగ సమాచారంకి సంబంధించిన వివరాలు, అర్హతలు అన్ని ఈ పోర్టల్‌లో లభ్యమవుతాయి.

అయితే కేవలం ఉన్నత విద్య అభ్యసించిన వారికే కాదు.. ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వారి నుంచి.. మొదలు.. బీటెక్, ఎంటెక్ చేసిన విద్యార్ధుల వరకు ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోర్టల్‍లో ఎప్పటికప్పుడు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ మేళాల వివరాలను నిర్వాహకులు పోర్టల్‍లో అప్‌డేట్‌ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో నమోదు చేసుకున్న కంపెనీల్లో ఉద్యోగ వివరాలు ఉంటాయి. దీంతోపాటు ఆయా రాష్ట్రాల పరిధిలో ఉండే ఉద్యోగాల వివరాలు తెలుసుకోవడానికి జాబ్‍ సీకర్స్ అనే ఆప్షన్‍ కింది వివరాలను చూసుకునే వీలుంది. పోర్టల్‍లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థుల ఫోన్‍లకు.. ఉద్యోగాల వివరాలు పంపడంతోపాటు వారి పరిధిలోని ఎంప్లాయిమెంట్‍ ఎక్స్‌ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‍మేళాల వివరాలను కూడా పంపనున్నారు.

పోర్టల్‌లో నమోదుచేసుకోండి ఇలా..

నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ముందుగా https://www.ncs.gov.in/ వెబ్‍సైట్‍లో లాగిన్‍ అవ్వాలి. అనంతరం ఏయే ఉద్యోగాలకు అర్హత ఉన్నారో.. పోర్టల్‍లో నమోదు చేయాలి. ఆ తరువాత తమ అర్హతలకు ఏ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో సరిచూసుకోని ఆప్షన్లను సెలక్ట్ చేసుకుని ఓకే చేయాలి. అన్ని ఆప్షన్లను పూర్తి చేయాలి. ఆ తర్వాత.. చివరగా సెక్యూరిటీ కోడ్‍ని సబ్మిట్ చేయగానే.. పోర్టల్‍ యూజర్‍ ఐడీ రావడంతో పాటు నమోదిత ఫోన్‍కు ఓటీపీ వస్తుంది. దీన్ని నమోదు చేయగానే 19 డిజిట్‍ గల యూజర్‍ ఐడీ వస్తుంది. దీనితో ప్రతిసారి లాగిన్‍ అయ్యి.. ఎక్కడ ఏమేం ఉద్యోగాలకు ఖాళీలు ఉన్నాయో, కొత్తగా ఏమైనా ఉద్యోగాలు వచ్చాయో చూసుకోవచ్చు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.06 కోట్ల మందికి పైగా నిరుద్యోగులు.. ఉద్యోగాల కోసం వివరాలను నమోదు చేసుకున్నారు. వేల సంఖ్యలో ప్రైవేట్, కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చేందుకు రిజిస్టర్ అయి ఉన్నాయి. ప్రస్తుతం 2.91 లక్షల కొలువులు వివిధ కంపెనీల్లో ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన సమాచారం కోసం 18004251514 టోల్‍ఫ్రీ నంబర్‍ కూడా అందుబాటులో ఉంది. ఇది ఉదయం 8.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు పనిచేస్తోంది.

సో నిరుద్యోగులు… ఇక ఉద్యోగం లేదు అంటూ చింతించకుండా.. వెంటనే నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్‌లో మీ వివరాలను నమోదు చేసుకోండి.