వామ్మో… రికార్డు స్థాయిలో పసిడి.. కొనక తప్పదు మరి..!

Gold surges to record high.. nears Rs 37000, వామ్మో… రికార్డు స్థాయిలో పసిడి.. కొనక తప్పదు మరి..!

ఆషాడం ముగిసి.. శ్రావణ మాసం వచ్చింది. ఆషాడంలో కొద్ది రోజులు బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. మళ్లీ అమాంతం ధరలు నింగికెక్కాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగి.. సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి బంగారం ధర ఆరేళ్ల గరిష్టస్థాయికి చేరుకుంది. దేశీయ బులియన్‌ మార్కెట్‌లో సోమవారం 10 గ్రాముల (24 క్యారెట్) బిస్కెట్ బంగారం రూ.37,000 పైకి ఎగబాకింది. ఈ ధరల ఆధారంగానే మార్కెట్లో ఆభరణాలు అమ్మకాలు జరుగుతాయి. దీంతో దేశీయంగా కొనుగోలుదారులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

దేశీయంగా విక్రయించే బంగారమంతా దిగుమతి చేసుకుని విక్రయించేదే. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా, ధరలు మారుతుంటాయి. అంతేగాక డాలర్‌-రూపాయి మారకపు విలువలు కూడా ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం రూపాయి విలువ బలహీనంగా ఉండటం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు. అమెరికాలో వడ్డీరేట్లను అక్కడి కేంద్రబ్యాంక్‌ తగ్గించడం, చైనాతో జరుగుతున్న సుంకాల యుద్ధం నేపథ్యంలో, స్టాక్‌మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. దీంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఔన్సు (31.10 గ్రాములు) బంగారం 1465-1470 డాలర్ల మధ్య పలుకుతుంది. డాలర్‌ మారకపు విలువ కూడా రూ.70.73కు చేరడం వల్ల దేశీయంగా పసిడి ధరలు బాగా పెరిగాయి.

బంగారాన్ని బిస్కెట్ల రూపంలో విక్రయించే హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ బులియన్‌ మార్కెట్లో సోమవారం రాత్రి 10 గ్రాములు రూ.37,900-38,000 గా ఉంది. వెండి కిలో రూ.43,000 పైన ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *