బోటు ప్రమాదం: హర్షకుమార్ సడన్ ఎంట్రీ ఎందుకు? టీడీపీ ఆటాడిస్తుందా?

politics around boat accident, బోటు ప్రమాదం: హర్షకుమార్ సడన్ ఎంట్రీ ఎందుకు? టీడీపీ ఆటాడిస్తుందా?

కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ని టార్గెట్ చేస్తూ హర్ష కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు కొత్త రచ్చ మొదలైంది. ఇప్పటివరకు బోటు ప్రమాద ఘటన జరిగిన సమయంలో బోటులో 73 మంది ప్రయాణికులు ఉన్నారు అని అధికారులు చెప్తే, హర్షకుమార్ ప్రమాద సమయంలో బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలపై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా సీరియస్ రియాక్షన్‌తో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

బోటుకు పర్మిషన్‌ ఇచ్చిందే మంత్రి అవంతి అన్న హర్షకుమార్:

బోటులో 93 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తనకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక అంతే కాదు సోమవారం మధ్యాహ్నానికి బోటు జాడ తెలిసిందని కానీ లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయి అన్న భయంతో బోటును బయటకు తీయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు.  సంచలనం కోసమో – పేరు సంపాదించడం కోసమో తాను ఈ విషయాలను వెల్లడించడం లేదని అన్నారు. బోటులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని హర్షకుమార్ ఆరోపించారు. ఇందులో ఫారెస్ట్ – టూరిజం – ఇరిగేషన్ అధికారుల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ అధికారులే వ్యాపారం చేస్తున్నారని… అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి రావడం వారికి ఇష్టం లేదని మండిపడ్డారు. ఎక్కువ మందితో ప్రయాణిస్తున్న బోటుకు దేవీపట్నం ఎస్సై అనుమతి ఇవ్వలేదని… ఆ తర్వాత టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ – ఎస్పీలకు ఫోన్ చేసి బోటుకు పర్మిషన్ ఇప్పించేలా చేశారని అన్నారు.

హర్షకుమార్ వ్యాఖ్యలతో కొత్త అనుమానాలు:

బోటు ప్రమాదం పై మాజీ మంత్రి హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా బోటును బయటకు తీస్తే గానీ ఇంకా ఎంత మంది మృత్యువాత పడ్డారు.. బోట్ లో ప్రయాణించిన ప్రయాణికుల సంఖ్య ఎంత అనేది తెలిసే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బోటు మునిగిన ప్రాంతాన్ని గుర్తించినప్పటికీ బోటు ను బయటకు తీయడానికి ఇబ్బందికర పరిస్థితులు గోదావరి లో ఉన్నాయని నేవీ సిబ్బంది తెలిపారు. కాస్త వరద తగ్గిన తర్వాత బోటును బయటకు తీసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

హర్షకుమార్ ఆరోపణలు ఖండించిన అవంతి:

హర్షకుమార్ వ్యాఖ్యల్లో ఎంతమేర నిజముందో తెలియదు గానీ… హర్షకుమార్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విషయంలో అవంతి ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తనపై హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టుగా అవంతి చెప్పారు. ఆ రోజున బోటు అనుమతి కోసం ఏ అధికారినీ తాను ఒత్తిడి చేయలేదని అది అబద్ధమని కూడా అవంతి పేర్కొన్నారు. హర్షకుమార్ తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఏ శిక్షకు అయినా తాను సిద్ధమేనని ఒకవేళ నిరూపించలేకపోతే హర్షకుమార్ ఏ శిక్షకైనా సిద్ధమేనా? అని అవంతి ప్రశ్నించారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసిన హర్షకుమార్ పై పరువునష్టం దావా వేస్తానని అవంతి హెచ్చరించారు. మొత్తంగా అటు హర్షకుమార్ ఆరోపణలు ఇటు వాటికి కౌంటర్ గా అవంతి చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రమాదంపై కొత్త చర్చ మొదలైందనే చెప్పాలి.

 

అసలు హర్షకుమార్ సడన్ ఎంట్రీ ఎందుకు?

అసలు ఈ పరిస్థితుల్లో హర్షకుమార్ ఎందుకు సడన్ ఎంట్రీ ఇచ్చారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆయన ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. కానీ ఆ పార్టీ సీటు కేటాయించపోవడంతో అప్పుడే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక వైసీపీ వైపు చూసినా కూడా వారి పెద్దగా ఎంకరేజ్ చెయ్యలేదు. ఆయన ఆ ఇదితోనే ఇప్పుడు ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇక ఆ ప్రాంతనేతగా హర్షకుమార్‌కు ఇమేజ్ ఉంటుందని..అతనితో కావాలని విమర్శలు చేయించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం టీడీపీ చేస్తుందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *