బ్యాంకు సిబ్బంది నిర్వాకం… పోలీసులు ఫైర్!  

Glaring security lapse as employees forget to lock bank after work in Muzaffarnagar, బ్యాంకు సిబ్బంది నిర్వాకం… పోలీసులు ఫైర్!  

యూపీలోని ముజఫర్‌నగర్ పట్టణంలో బ్యాంకు నిర్వాకం బయటపడింది. విధులు ముగించుకున్న సిబ్బంది బ్యాంకుకు తాళం వేయకుండానే ఇంటికి వెళ్లిపోయారు. విషయాన్ని గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముజఫర్‌నగర్ బ్యాంచ్ సిబ్బంది అంతా మంగళవారం విధులకు హాజరయ్యారు. సాయంత్రం వేళ ఇంటికెళ్లే హడావుడిలో బ్యాంకుకు తాళం వేయకుండా వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో అటుగా వెళ్లున్న కొందరు స్థానికులకు అనుమానం వచ్చి చూడగా బ్యాంకులో సిబ్బంది ఎవరూ లేరు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాంక్ మేనేజర్‌కు ఫోన్ చేసి రప్పించారు. కొద్దిసేపటికే బ్యాంక్ మేనేజర్, సిబ్బంది అక్కడికి చేరుకుని తాము చేసిన పొరపాటును గమనించారు. ఇంటికెళ్లే హడావుడిలో తాళం వేయడం మరిచిపోయామని సిబ్బంది చెప్పడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా బ్యాంకులోకి చొరబడి దోచుకుపోతే పరిస్థితి ఏంటని నిలదీశారు.

ఇది పూర్తిగా బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యమేనని నిర్ధారణకు వచ్చిన పోలీసులు లిఖిలపూర్వక వివరణ ఇవ్వాలని మేనేజర్‌ను కోరారు. దీంతో బ్యాంక్ మేనేజర్ తమ పొరపాటుతో బ్యాంక్ మంగళవారం రాత్రి 7.30-10.00 గంటల మధ్య అనధికారికంగా తెరిచి ఉందని రాసిచ్చారు. బ్యాంక్‌ను సందర్శించిన ముజఫర్‌నగర్ ఎస్పీ సప్తాల్ యాంటిల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది పూర్తిగా బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యమేనన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, బ్యాంక్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. బ్యాంకులో నగదు గానీ, వస్తువులు గానీ చోరీకి గురికాలేదన్నారు. ఈ విషయంలో స్పందించి తమకు సమాచారమిచ్చిన స్థానికులను ఆయన అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *