జీహెచ్ఎంసీ ఎన్నికలుః రిజర్వేషన్లు యధాతథం.. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

జీహెచ్ఎంసీ జగడంలో ట్విస్టులు కనిపిస్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల డిమాండ్‌ ఊపందుకుంటోంది.

  • Balaraju Goud
  • Publish Date - 8:06 pm, Tue, 17 November 20
జీహెచ్ఎంసీ ఎన్నికలుః రిజర్వేషన్లు యధాతథం.. అత్యవసర విచారణకు హైకోర్టు నిరాకరణ

#ghmcelectionsreservations: దుబ్బాక గెలుపుతో కమలదళం ఊపు మీదుంటే.. గుర్తుల తికమకపై ఫోకస్‌ పెట్టింది అధికారపక్షం. విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్న హైదరాబాద్ మహానగరంలో చేసిన అభివృద్దియే కారు జోరు పెంచుతుందని భావిస్తుండగా, హైదరాబాద్‌కు టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదనీ, ఓట్ల కోసం ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తోంది. గ్రేటర్‌ పోరులో ఎవరి వ్యూహాలు వారివే. అదే టైమ్‌లో కొత్త రిజర్వేషన్ల పంచాయితీ హైకోర్టుకు చేరింది.

జీహెచ్ఎంసీ జగడంలో ట్విస్టులు కనిపిస్తున్నాయి. కొత్త రిజర్వేషన్ల డిమాండ్‌ ఊపందుకుంటోంది. దీనిపై ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు ప్రతిపక్ష నేతలు. కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలని.. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలన్నది వారి వాదన. రిజర్వేషన్లు రొటేషన్‌ చేశాకే ఎన్నికలు నిర్వహించాలని అంటోంది బీజేపీ. ఈ పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ బెంచ్‌ విచారణకు చేపట్టింది.

అయితే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై రొటేషన్ పద్దతిని అనుసరించకపోవడం చట్టవిరుద్దమని పేర్కొంటూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌లో.. గ్రేటర్ పరిధిలోని 150 వార్డులకు 2016 నాటి రిజర్వేషన్లనే కొనసాగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ఇప్పటికే వెల్లడించింది. రిజర్వేషన్లు ప్రభుత్వ పరిధిలోని వ్యవహారమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి వెల్లడించారు.

సాధారణంగా రొటేషన్ పద్దతిలో… ఇప్పటివరకూ అవకాశం రాని సామాజికవర్గాల జనాభాను అనుసరించి రిజర్వేషన్లు అమలుచేస్తారు. అయితే, జీహెచ్ఎంసీ పాలకమండలి రిజర్వేషన్లను రెండు దఫాలు యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా చట్టం చేసింది. దీంతో ఈసారి పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. పాత రిజర్వేషన్ల ప్రకారం… గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్టీలకు 2 డివిజన్లు, ఎస్సీలకు 10 డివిజన్లు రిజర్వు కాగా, మొత్తంగా మహిళలకు 75 డివిజన్లను రిజర్వు చేశారు. 44 డివిజన్లు అన్‌ రిజర్వుడ్‌ కేటగిరీలో ఉన్నాయి.

అంతకుముందు,ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్‌పై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఎన్నికలపై స్టే ఇవ్వాలని పిల్‌లో శ్రవణ్ పేర్కొన్నారు. విద్యారంగంలో బీసీల రిజర్వేషన్లు, రాజకీయ బీసీ రిజర్వేషన్లు వేర్వేరు అని తెలిపారు. రాజకీయంగా వెనుకబడిన బీసీలను గుర్తించే ప్రక్రియ లేదని పేర్కొన్నారు. అయితే, హైకోర్టు ఈ వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంబీసీలపై అంత ప్రేమ ఉంటే పదేళ్ల నుంచి ఎందుకు స్పందించలేదనని ప్రశ్నించింది. ఎన్నికల షెడ్యూల్ రాబోయే చివరి నిమిషంలోనే ఈ విషయం ఎందుకు గుర్తుకొచ్చిందని మండిపడింది. రాజకీయ దురుద్దేశంతోనే పిల్ దాఖలు చేశారని వ్యాఖ్యానించింది. ఎన్నికలపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీకి నోటీసులు జారీచేసింది. దీనిపై 2015, 2016లో దాఖలైన పిటిషన్లను జత చేయాలని రిజిస్ట్రార్‌ను హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను మొత్తం 14 రోజుల్లో పూర్తి చేయాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. డిసెంబర్ 1న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 4న ఫలితాలను వెల్లడించనుంది. ఎన్నికల ప్రక్రియ నవంబర్ 17 నుంచి మొదలై డిసెంబర్ 6వ తేదీ లోపు పూర్తి చేయాలని భావిస్తోంది. ఈసారి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహించనున్నారు.